Share News

Food Delivery Apps: కస్టమర్లకు స్విగ్గీ, జొమాటో షాక్.. భారీగా పెంచిన ధరలు

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:36 PM

ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు(Swiggy, Zomato) షాక్ ఇచ్చాయి. ఇవి తమ ప్లాట్‌ఫారమ్ ఫీజు ధరలను రూ.6 పెంచినట్లు సమాచారం.

Food Delivery Apps: కస్టమర్లకు స్విగ్గీ, జొమాటో షాక్.. భారీగా పెంచిన ధరలు

ఇంటర్నెట్ డెస్క్: ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు(Swiggy, Zomato) షాక్ ఇచ్చాయి. ఇవి తమ ప్లాట్‌ఫారమ్ ఫీజు ధరలను రూ.6 పెంచినట్లు సమాచారం. ఎకనామిక్ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. బెంగళూరు, ఢిల్లీ వంటి కీలక నగరాల్లో Zomato, Swiggy ప్లాట్‌ఫారమ్‌ ధరలు పెరిగాయి. ఈ మార్కెట్‌లలో ప్రస్తుతం రూ.5 వసూలు చేస్తుండగా ఇది 20 శాతం పెరిగి రూ.6కు చేరుకోనుంది.

స్విగ్గీ ప్రస్తుతం బెంగుళూరులో రూ.7 ప్లాట్‌ఫారమ్ రుసుమును వసూలు చేస్తుండగా రాయితీ తరువాత దాన్ని రూ.6కి తగ్గించారు. స్విగ్గీ, జొమాటోలు ప్లాట్‌ఫామ్‌ ఫీజులను పెంచడం ఇది మొదటిసారేం కాదు. ఈ రెండు కంపెనీలు 2023లో ఈ తరహా ఫీజును ప్రవేశపెట్టాయి. రూ.2తో దీన్ని ప్రారంభించి.. క్రమంగా పెంచుతూ వచ్చాయి.


ఏప్రిల్‌లో జొమాటో 25 శాతం పెంచి రూ.5 గా చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, లఖ్‌నవూ నగరాల్లో కూడా ఈ పెంపును వర్తింపజేసింది. వేగవంతమైన డెలివరీ కోసం ప్రియారిటీ ఫీజు పేరిట జొమాటో ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీల హవా నడుస్తోంది. ఈ కంపెనీలకు చెందిన బ్లింకిట్‌, ఇన్‌స్టామార్ట్ సైతం హ్యాండ్లింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.


బెంగళూరులో బ్లింకిట్‌ ఆర్డర్‌పై రూ.4, ఇన్‌స్టామార్ట్‌ రూ.5, ఢిల్లీలో రూ.16, రూ.5గా వసూలు చేస్తున్నాయి. జనవరిలో స్విగ్గీ కొంత మంది కస్టమర్లకు ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.10గా చూపించినా నిజానికి ఆ ఫీజును వసూలు చేయలేదు. రూ.5 రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించి ఫైనల్ బిల్లులో తగ్గించింది. మరోవైపు కొన్ని సమయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు సర్జ్‌ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. టాటాకి చెందిన బీబీనౌ రూ.99కిపైగా ఉండే ఆర్డర్లపై రూ.5 హ్యాండ్లింగ్‌ ఛార్జీలు సేకరిస్తోంది. ఒక్కో ఆర్డర్‌పై వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఈ ఫీజును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 12:36 PM