Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు
ABN , Publish Date - May 03 , 2024 | 01:04 PM
ఆమె ఫేస్‌బుక్(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.
- ఆపై కిడ్నాప్, దోపిడీ
- పారిశ్రామికవేత్తలను మోసగించిన కి‘లేడీ’ అరెస్ట్
చెన్నై: ఆమె ఫేస్‌బుక్(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది. ఇలా 50 మందికి పైగా పారిశ్రామికవేత్తలను దోచుకున్న ఓ కి‘లేడీ’ ఎట్టకేలకు కటకటాల పాలైంది. ఆమే పాళయంకోటకు చెందిన భానుమతి (40). ఎప్పటిలానే ఓ పారిశ్రామికవేత్తను మోసగించే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడిన ఆ మహిళకు సంబంధించిన వివరాలిలా...
ఇదికూడా చదవండి: Hyderabad: నకిలీ పత్రాలతో రూ. 3.13 కోట్ల మోసం..
సేలం జిల్లా అయ్యన్‌పెరుమాళ్‌పట్టి ప్రాంతానికి చెందిన నిత్యానందం (47) అనే విండ్ మిల్స్ పరికరాల టోకు వ్యాపారవేత్తతో పాళయం కోట పెరుమాళ్‌పురం ఎన్జీవో కాలనీకి చెందిన భానుమతికి మూడు నెలల క్రితం ఫేస్‌బుక్(Facebook) ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో భానుమతి తన ఇంటికి ఆహ్వానించింది. ఆ మహిళ మాటలను నమ్మి తిరునల్వేలికి వెళ్ళిన నిత్యానందంకు చేదు అనుభవం ఎదురైంది. భానుమతి తెలిపిన చిరునామాలో ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు భానుమతి, ఆమె మగమిత్రులు ఐదుగురు కలిసి ఆయన్ని బంధించారు. భానుమతిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసి అవమానాలపాలు చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా ఆయన దగ్గరున్న రూ.10లక్షలు, నగలను దోచుకున్నారు. ఆలా నిలువుదోపిడీకి గురైన నిత్యానందం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భానుమతి గుట్టు రట్టయ్యింది. భానుమతి చెన్నై, కాంచీపురానికి చెందిన పారిశ్రామికవేత్తలు సహా సుమారు 50 మందిని మోసగించి నగలు, నగదు అపహరించినట్లు వెల్లడైంది.
ఇదికూడా చదవండి: Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. చోరీలు ఎక్కువయ్యేది వేసవిలోనే
భానుమతికి పదేళ్లకు ముందు ఆళ్వార్‌తిరునగరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైందని, ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారని, ఆమె ప్రవర్తన నచ్చకపోవడంతో భర్త, పిల్లలు ఆమెను విడిచి పెట్టి వెళ్ళారని తెలిసింది. ఆ తర్వాత భానుమతికి చిన్ననాటి మిత్రుడు వెల్లైదురై (42)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత ఏడేళ్లుగా అతడితో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ విలాసవంతంగా గడిపేందుకు లక్షలాది రూపాయలను అక్రమ మార్గంలో సంపాదించాలని వ్యూహం పన్నారు. తమ మోసాలకు పార్థసారథి, రంజిత్, సుడలై అనే వారి సాయం తీసుకున్నారు. భానుమతి ఫేస్‌బుక్‌లో పారిశ్రామికవేత్తలను, కోటీశ్వర్లను టార్గెట్‌గా చేసుకుని వారితో పరిచయం పెంచుకుంటూ ఉల్లాసంగా గడుపుదామని రమ్మంటూ తిరునల్వేలికి ఆహ్వానించి తన సహచరులతో కలిసి వారిని కిడ్నాప్ చేసి, బెదరించి లక్షలాదిరూపాయలను దోచుకునేది. ఏడేళ్లుగా భానుమతి ఇలా చెన్నై, కాంచీపురం ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని మాయమాటలతో వారిని బోర్లా కొట్టించి నగలు, నగదు దోచుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని భానుమతితో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆమె సన్నిహితుడు పార్థసారథి ఆచూకీకోసం తిరునల్వేలి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఆయుధాలను విక్రయించడానికి యత్నిస్తున్న యువకుడి అరెస్ట్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News