Share News

RK Kothapaluku: హైడ్రాకు రాహుల్‌ సైతం!

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:33 AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్‌ అండ్‌ కో అరాచక పాలనను...

RK Kothapaluku: హైడ్రాకు రాహుల్‌ సైతం!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్‌ అండ్‌ కో అరాచక పాలనను ప్రజలు మరువకముందే అదే బాటలో పయనించే ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రమే ఈ హెచ్చరిక. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా సాగిన జగన్మోహన్‌రెడ్డి పాలనను ఆదర్శంగా తీసుకొని అదే బాటలో పయనించాలనుకొనేవారు తస్మాత్‌ జాగ్రత్త! గత ప్రభుత్వంపై ఏవగింపుతో ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించారన్న వాస్తవాన్ని మరచి కొంతమంది శాసనసభ్యులు గతంలో మాదిరి సామంత రాజులుగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారు తమ పోకడల ద్వారా ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకురావడమే కాకుండా రాష్ర్టానికి కూడా తీరని ద్రోహం చేయబోతున్నారని గుర్తెరగాలి. ఏ రాయి అయితేనేం పళ్లు రాలగొట్టుకోవడానికి అన్న భావన ప్రజల్లో ఏర్పడితే అది రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తుంది. ఏ కారణాల వల్ల ప్రజలు జగన్‌రెడ్డి పాలనను తిరస్కరించారో మరచిపోయి తాము కూడా అదే పెడదారిలో పయనించాలనుకుంటే ప్రజలు సహించబోరని తెలుసుకోవాలి. అధికార కూటమి నేతల చర్యల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రతిష్ఠ మాత్రమే దెబ్బతింటుందని అనుకోవడం పొరపాటు. చంద్రబాబు నాల్గవ పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. 2029 ఎన్నికల నాటికి ఆయన వయసు 78 ఏళ్లు దాటుతుంది. ఈ ఐదేళ్లలో ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారి 2029లో మళ్లీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఏమిటో కూటమి ఎమ్మెల్యేలు అనుక్షణం గుర్తించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుంది.


గత ఐదేళ్లలో భ్రష్టుపట్టిపోయిన పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మారిన పరిస్థితులలో కేంద్రంలో పెరిగిన తన పరపతిని ఉపయోగించి రాష్ర్టానికి మేలు చేకూర్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించడమూ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. గత పాలనలోని అవలక్షణాలను కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు పుణికిపుచ్చుకొని అధికార దర్పం వెలగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతం నాది, ఇక్కడ నా మాటే చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా కొందరు విర్రవీగుతున్నారు. గుంటూరు జిల్లాలో తాజాగా జరిగిన రెండు సంఘటనలను తీసుకుందాం. ఒక ఎమ్మెల్యే భర్త తాను గతంలో అంగీకరించిన ధర కంటే తక్కువ ధరకే భూమిని తనకు అమ్మాలని సదరు భూ యజమానిపై దౌర్జన్యం చేశారు. తన మాట వినని ఆ భూ యజమానిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దురాగతాలు జరగడం వల్లనే కదా ప్రజలు జగన్‌ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించారు! అదే గుంటూరు జిల్లాలో అదే రోజు మరో ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజు వేడుకలకు పోలీసు అధికారులు హాజరై సభ్య సమాజం ఆశ్చర్యపోయేలా చేశారు. జగన్‌ పాలనలో ఇలాంటివే జరిగాయి. పాత అలవాట్ల ప్రకారం పుట్టినరోజు వేడుకలకు పోలీసు అధికారులను అనుమతించిన సదరు ఎమ్మెల్యే తాను ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నానన్న విషయం మరచిపోయారు. అయితే ఈ రెండు సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు ముదావహం. ఎమ్మెల్యే భర్త ఆదేశాల ప్రకారం తక్కువ ధరకు భూమి విక్రయించడానికి నిరాకరించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన ఇన్‌స్పెక్టర్‌ను ప్రభుత్వం వెంటనే బదిలీ చేసింది. ఆ అధికారిని వేకెన్సీ రిజర్వుకు బదిలీ చేశారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలను పాటించడమే తమ విధి అన్నట్టుగా వ్యవహరించే అధికారులకు ఇదొక హెచ్చరిక! గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించేవారు. ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసు అధికారులు అందరికీ మెమోలు జారీ చేయాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రూల్‌ ఆఫ్‌ లా పాటించడం అంటే ఇదీ. ప్రజాస్వామ్యంలో పాలకులైనా, అధికారులైనా ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. తప్పు జరిగినప్పుడు తర తమ భేదం చూపకుండా చర్యలు తీసుకుంటే రూల్‌ ఆఫ్‌ లా పాటించినట్టు అవుతుంది. అది నాగరిక పాలన అవుతుంది. గత ఐదేళ్లలో ఆటవికంగా సాగిన పాలనను చూశాం. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతం అయితే ప్రజలు ఎంత మాత్రం సహించరు. ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పుడు చంద్రబాబు వెంటనే స్పందించడాన్ని అభినందించాల్సిందే.


సున్నిత మనస్కులు మాత్రమే ఇలా స్పందిస్తారు. పాలెగాళ్ల పోకడలను జీర్ణించుకున్నవారు మాత్రం అరాచకాలు జరిగినప్పుడు ఆనందిస్తారు. జగన్‌రెడ్డి పాలనలో జరిగిన దౌర్జన్యాలు, దురాగతాలకు ప్రతీకారం ఇంకెప్పుడు తీర్చుకుంటారు? అంటూ తెలుగు తమ్ముళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపరీతమైన ఒత్తిడి వస్తోంది. అయినా ఆయన సంయమనం పాటిస్తున్నారు. పాలెగాళ్ల రాజ్యాన్నే కొనసాగిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలసిపోతుందని ఆయనకు తెలుసు. అందుకే గత ఘోరాలు, నేరాలపై ఆధారాలు లభించినప్పుడు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లు ఆవేశపడుతున్నారని ఆయన కూడా ఆవేశపడటం లేదు. అదే సమయంలో హద్దు మీరుతున్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు వాతలు పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలను మంత్రివర్గ సమావేశంలో పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘నేను మా వాళ్లను హెచ్చరిస్తాను. మీరు మీ వాళ్లకు క్లాస్‌ తీసుకోండి’ అని జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు సూచించారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ, కూటమి ఎమ్మెల్యేలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరిద్దామని అభిప్రాయపడ్డారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది నాయకులు ఫలానా ప్రాంతాన్ని తమకు రాసిచ్చారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఏది కావాలన్నా, ఏది జరగాలన్నా తన అనుమతి తప్పనిసరి అని హుకుం జారీ చేస్తున్నారు. రాయించుకోవడానికి మీరెవ్వరు? రాసివ్వడానికి వారెవ్వరు? ప్రజలు మీకు ఐదేళ్లపాటు అధికారంలో ఉండి తమకు సేవ చేయమని మాత్రమే రాసిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా? ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో ఇలా రాశారు? అధికారుల విధుల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? అధికారులకు జీతాలు ఇస్తున్నది ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడానికి కాదు! అధికారులు, ఉద్యోగులు తాము ప్రజా సేవకులం, పబ్లిక్‌ సర్వెంట్స్‌ అని మరచిపోతే ఎలా? జగన్‌రెడ్డి పాలనలో ఈ దరిద్రపు సంస్కృతి జడలు విప్పుకొని కరాళ నృత్యం చేసింది. ప్రజలు ఛీత్కరించుకున్న అదే సంస్కృతిని కూటమి పాలనలో కూడా కొనసాగించాలనుకుంటే కుదరదు. బాధ్యత గల మీడియాగా మేం అలాంటి వారిపై కొరడా ఝళిపిస్తాం.


ఇదో గుణపాఠం!

ముంబైకి చెందిన నటి కాదంబరీ జెత్వానీ విషయంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు చూస్తున్నాం. ఐపీఎస్‌ అధికారులు సైతం తమ బాధ్యతను విస్మరించి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంలో ఆడపిల్ల అయిన కాదంబరికి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులకు వత్తాసు పలుకుతూ జగన్‌రెడ్డి మీడియాలో వార్తలు వండి వారుస్తున్నారు. ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా? జర్నలిజంలోని కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా బాధితురాలినే విలన్‌గా చిత్రించడమా? అంతకంటే అపచారం ఉంటుందా? అందుకే జగన్‌రెడ్డి సొంత మీడియాను రోత మీడియా అని పిలవాల్సి వస్తోంది. సదరు రోత మీడియాకు వంత పాడుతున్న వారిని కూలి మీడియా అనడంలో తప్పేముంది? ప్రముఖ వ్యాపారి సజ్జన్‌ జిందాల్‌తో పాటు ఏషియన్‌ పెయింట్స్‌ అధినేతను కాదంబరి బ్లాక్‌ మెయిల్‌ చేశారని రోత మీడియా ఆవేశపడుతోంది. అది కూడా నిజమే అనుకుందాం. బ్లాక్‌ మెయిల్‌ సంఘటన జరిగివుంటే, అది ముంబైలో కదా జరిగింది? ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఏం పని? అయినా, ఆమె బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం సదరు వ్యాపార దిగ్గజాలు ఎందుకు కల్పించారు? అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, సజ్జన్‌ జిందాల్‌ను కలుసుకున్న తర్వాతే కాదంబరికి కష్టాలు మొదలయ్యాయని ప్రస్తుతం పోలీసు విచారణలో స్పష్టమవుతోంది. సజ్జన్‌ జిందాల్‌ తరఫున అనైతికంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉండకపోవచ్చు. దాంతో జిందాల్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఆశ్రయించి ఉంటారు. అప్పటికే ఆటవిక పాలనకు అలవాటు పడిన జగన్‌రెడ్డి సదరు సజ్జన్‌ జిందాల్‌కు అభయం ఇవ్వడం, తాము చట్టానికి బాధ్యులం అన్న విషయం మరచిన కాంతి రాణా, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విశాల్‌ గున్ని వంటి అధికారులు పాలకుడి ఆదేశాలను ఔదలదాల్చడంతో ఇదంతా జరిగింది. కాదంబరి అనే మోడల్‌ తమను బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని సజ్జన్‌ జిందాల్‌ అండ్‌ కో మహారాష్ట్రలో అధికారికంగా ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కాదంబరితో తమకున్న సంబంధం ఏమిటి? ఆమె తమను ఎలా బ్లాక్‌మెయిల్‌ చేశారో, ఎందుకు చేశారో సదరు పారిశ్రామికవేత్తలు చెప్పాలి కదా? తమను బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం కల్పించిన పారిశ్రామికవేత్తలు నోరు విప్పాలి కదా? జిందాల్‌ అండ్‌ కోకు మేలు చేయడం కోసం నాటి ప్రభుత్వం కుక్కల విద్యాసాగర్‌ అనే వ్యక్తిని రంగప్రవేశం చేయించింది. రోత మీడియా కథనాల ప్రకారం కుక్కల విద్యాసాగర్‌ను కూడా కాదంబరి బ్లాక్‌మెయిల్‌ చేసి భూమి రాయించుకున్నారు. దానిపై కుక్కల ఫిర్యాదు చేసినందునే పోలీసులు కాదంబరిని ముంబై నుంచి తీసుకువచ్చారట. ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్‌ ఫిర్యాదు చేసినట్టు రికార్డులలో ఉంది. అలాంటప్పుడు ఫిబ్రవరి ఒకటవ తేదీనే విశాల్‌ గున్ని, రమణమూర్తి, ముత్యాల సత్యనారాయణ తదితర అధికారులు మహిళా పోలీసులు లేకుండా గన్నవరం నుంచి ముంబై ఎందుకు వెళ్లారు? కాదంబరి కొనకపోయినా, భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను డాక్యుమెంట్‌ రైటర్‌ను బెదిరించి తమకు కావాల్సింది రాయించారు. అయినా జగన్‌ రోత మీడియా తప్పు చేసిన అధికారులను రక్షించే ప్రయత్నాన్ని నిస్సిగ్గుగా చేస్తోంది.


హనీ ట్రాప్‌ చేయడం కాదంబరికి అలవాటేనని కుక్కల విద్యాసాగర్‌ వాపోతున్నట్టుగా కూడా మరో రోత కథనం ప్రచురించారు. నిజమే అనుకుందాం. రాష్ట్రంలో అయిదు కోట్ల మంది జనాభా ఉన్నారు. విద్యాసాగర్‌ కంటే ధనవంతులు ఉన్నారు. అయినా కుక్కలను మాత్రమే ఆమె ఎందుకు ఎంచుకున్నారు? అంటే అతడు ఆమెతో వ్యవహారానికి ప్రయత్నించినట్టే కదా? సజ్జన్‌ జిందాల్‌ అయినా, మరొకరు అయినా ఆమె జోలికి వెళ్లి ఉండకపోతే బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం వచ్చేది కాదు కదా? వ్యక్తిగత బలహీనతల వల్ల ఇబ్బందుల్లో పడ్డవారు సానుభూతికి అనర్హులు. అలాంటి వారికి వత్తాసు పలుకుతున్న జగన్‌ మీడియా రోత మీడియానే అవుతుంది. గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను ఏ స్థాయిలో భ్రష్టుపట్టించారో ఈ సంఘటనను బట్టి తెలుస్తోంది. పోలీసులపై అతిగా ఆధారపడి పాలించిన ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అయినా బ్లాక్‌మెయిల్‌ చేశారని చట్టవిరుద్ధంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టవచ్చా? అలా అయితే వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డిని కూడా ఇలాగే చిత్రహింసలు పెట్టవచ్చా? అలా చేస్తే ఇదే రోత మీడియా గగ్గోలు పెట్టదా? ఇప్పుడు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు ఈ వాస్తవాన్ని మరచిపోకూడదు. పోలీసు అధికారులకు కూడా కాదంబరి వ్యవహారం ఒక గుణపాఠం అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా పాపం పండుతుంది అంటారు. అందుకే గత పాలనలోని చేదు జ్ఞాపకాలను మరిపించే విధంగా కూటమి నేతలు వ్యవహరించకూడదు. తస్మాత్‌ జాగ్రత్త!


రేవంత్‌ సాహసం!

తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తోంది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలే మీడియాలో కూడా అధిక ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. హైడ్రాకు పురుడు పోసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి తేనెతుట్టెను కదిలించారని, పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా, హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానీకం ఆయనకు జేజేలు పలుకుతోంది. ఆరంభం అదుర్స్‌.. ముగింపు ఎలా? ఎప్పుడు? అనేవే ప్రస్తుతం కీలక ప్రశ్నలు. ప్రాంతీయ పార్టీల అధినేతలు మాత్రమే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలరు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ఇటువంటి సాహసం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడగలుగుతుండటం సామాన్య విషయం కాదు. కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా మొదటి రోజే కూల్చివేశారు. ఆ రోజు పళ్లంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేసిన వారి జాబితాలో కేవీపీ రామచంద్రరావు పేరు కూడా ఉన్నట్టు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం మిగతా విషయాలతో పాటు కూల్చివేతలపై చర్చించడానికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. ఈ సందర్భంగా పళ్లంరాజు ఫిర్యాదుపై ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీశారని తెలిసింది. దీంతో కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు పళ్లంరాజు ఎలా ప్రయోజనాలు పొందారో వివరించి, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోదని పళ్లంరాజు ఎవరెవరి వద్ద వ్యాఖ్యానించారో కూడా రేవంత్‌రెడ్డి సాక్ష్యాధారాలతో అధిష్ఠానానికి వివరించారు. అంతేకాకుండా కూలగొట్టిన భవనం అక్రమంగా నిర్మించినదని నిరూపించారు. దీంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కల్పించుకొని, ముఖ్యమంత్రి రేవంత్‌ చర్యలను తాను సమర్థిస్తున్నానని, ఆయనను అడ్డుకోవద్దని కాంగ్రెస్‌ ముఖ్యులకు స్పష్టంచేశారు. అంతే, రేవంత్‌రెడ్డికి కొండంత అండ లభించింది. ఈ సంఘటన పర్యవసానంగా కూల్చివేతలపై రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వినిపించకుండా పోయాయి. ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ, రేవంత్‌రెడ్డి ప్రస్తుతం అటు పార్టీ అధిష్ఠానం నుంచి, ఇటు ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు దురాక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఒక మోస్తరు వర్షానికి కూడా హైదరాబాద్‌ జలమయం అవుతోంది. ప్రజలు ఈ విషయమై ఆగ్రహంగా ఉన్నారు. ఫలితంగా ముఖ్యమంత్రి చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతానికి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా దృష్టి కేంద్రీకరించింది. బఫర్‌ జోన్‌లో నిర్మించిన కట్టడాల జోలికి ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లలేదు. నిజానికి ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలు అతి స్వల్పం. అయినప్పటికీ హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలన్న డిమాండ్‌ వస్తోంది. భారత రాష్ట్ర సమితి మినహా మిగతా ప్రతిపక్షాలు ఈ కూల్చివేతలను విమర్శించలేని పరిస్థితి. బీఆర్‌ఎస్‌ కూడా సన్నాయి నొక్కులకే పరిమితమైంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల పాపం బిల్డర్లు, అధికారులదే. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ వంటి సంస్థల అనుమతితో నిర్మించిన ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసిన వారికి ఏ పాపం తెలియదు. వారిని ఇప్పుడు శిక్షించడం కూడా అన్యాయం అవుతుంది.


ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకపోగా ప్రోత్సహించాయి. ఫలితంగా హైదరాబాద్‌కు జలప్రళయం పొంచి ఉంది. బఫర్‌ జోన్‌లో నిర్మించిన కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ఎంతవరకు వెళతారో తెలియదు. ఇక 111 జీవో వ్యవహారం ఉండనే ఉంది. దశాబ్దాల క్రితం అమలులోకి వచ్చిన ఈ జీవో విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు ఈ జీవోను అప్పట్లో తెచ్చారు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజల మంచినీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఔటర్‌ రింగురోడ్డు వచ్చింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఔటర్‌ రింగు రోడ్డు నిర్మించిన తర్వాత దాని లోపల ఉన్న ప్రాంతాన్ని 111 జీవో పరిధిలోనిదిగా పరిగణించడం అర్థరహితం. ఔటర్‌ లోపలా, వెలుపలా విచ్చలవిడిగా నిర్మాణాలు వచ్చాయి. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు కూడా 111 జీవో పరిధిలోని భూమిలోనే నిర్మించారు. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ను ఇప్పుడు మంచినీటి అవసరాలకు ఉపయోగించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రెండు జలాశయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసి 111 జీవో పరిధిలోని ప్రాంతంలో కొన్ని పరిమితులతో ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్మాణాలకు అనుమతించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అదే సమయంలో అక్రమ కట్టడాలు, పద్ధతీ పాడూ లేకుండా జరుగుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 111 జీవో ఎత్తివేస్తున్నట్టు ప్రకటన మాత్రమే చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెరువులను పరిరక్షించడంతో పాటు 111 జీవో విషయంలో స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో 111 జీవో పరిధిలోని చెరువులు కూడా ఆక్రమణలకు గురవుతాయి. మళ్లీ కూల్చివేతలు అంటూ హడావిడి చేయవలసి వస్తుంది. అందుచేత 111 జీవో పరిధిలో శాస్ర్తీయ పద్ధతిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వాంఛనీయం. ఇప్పటికే 60 అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు వేలం వెర్రిగా అనుమతులు ఇచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం, సైబరాబాద్‌కు కూడా తీరని అపచారం చేసింది. వందలు, వేల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పుడు 50 నుంచి 60 అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటి? ఇకపై అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారులను అందుకు బాధ్యులను చేయడంతో పాటు 111 జీవో విషయంలో హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుంటే గ్రేటర్‌ హైదరాబాద్‌కు మేలు చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిగిలిపోతారు!

ఆర్కే

Updated Date - Sep 01 , 2024 | 07:59 AM