Share News

TG: లోక్‌సభ ఎన్నికల లెక్క వేరు!

ABN , Publish Date - May 07 , 2024 | 05:32 AM

తెలంగాణ ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో ఒక రకంగా, పార్లమెంటు ఎన్నికల విషయంలో మరోలా స్పందిస్తున్నారా? ఎమ్మెల్యేలుగా ఒక పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ.. ఎంపీలుగా మరో పార్టీవైపు మొగ్గుతున్నారా? అంటే.. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇది నిజమేననిసిస్తోంది.

TG: లోక్‌సభ ఎన్నికల లెక్క వేరు!

  • అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు

  • 2018లో అధికారంలోకి బీఆర్‌ఎస్‌

  • 2019లో పార్లమెంటు ఎన్నికల్లో దక్కని ఆ స్థాయి ఫలితాలు

  • ఐదు నెలల వ్యవధిలోనే భారీ తేడా

  • జాతీయ పార్టీల వైపు ఓటర్ల మొగ్గు

  • బీఆర్‌ఎస్‌ పట్ల ఈసారీ.. అదే ధోరణి అంటున్న సర్వేలు

  • వాస్తవ ఫలితం ఎలా ఉండేనో?

(ఆంధ్రజ్యోతి, సెంట్రల్‌ డెస్క్‌)

తెలంగాణ ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో ఒక రకంగా, పార్లమెంటు ఎన్నికల విషయంలో మరోలా స్పందిస్తున్నారా? ఎమ్మెల్యేలుగా ఒక పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ.. ఎంపీలుగా మరో పార్టీవైపు మొగ్గుతున్నారా? అంటే.. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇది నిజమేననిసిస్తోంది. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ 88 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తెలిసిందే. కానీ, ఆ వెంటనే జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను బీఆర్‌ఎస్‌ 9 మాత్రమే దక్కించుకోగలిగింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లను చూసి.. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమదే హవా అని గులాబీ నేతలు భావించారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎ్‌సలో చేరారు. దీంతో 17 పార్లమెంటు స్థానాల్లో తమ మిత్రపక్షంగా పేర్కొన్న ఎంఐఎంకు ఒక స్థానం పోను 16 ఎంపీ సీట్లను తామే గెలుచుకుంటామని ప్రకటించారు. ‘సారు.. కారు.. పదహారు’ నినాదంతో పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. కానీ, వారి అంచనాలు తలకిందులై తొమ్మిది స్థానాలకే పరిమితమయ్యారు. అనూహ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ మూడు స్థానాలను దక్కించుకున్నాయి.


అత్యధిక ఓట్లు వచ్చిన ఎంపీ స్థానాల్లోనూ ఓటమి

2018 శాసనసభ ఎన్నికల్లో 15 పార్లమెంటు స్థానాల పరిధిలో మెజారిటీ ఓట్లను బీఆర్‌ఎస్సే సాధించింది. కొన్ని ఎంపీ స్థానాల పరిధిలో మెజారిటీ అసెంబ్లీ సీట్లను కోల్పోయినా.. ఓట్ల పరంగా మాత్రం గులాబీ పార్టీకే ఆధిక్యం దక్కింది. కానీ, 2019 పార్లమెంటు ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ ఆధిక్యాన్ని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేకపోయింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్‌ఎస్‌.. పార్లమెంటు ఎన్నికలు వచ్చేటప్పటికి చతికిలబడింది. ఈ స్థానాలను అనూహ్య రీతిలో బీజేపీ దక్కించుకుంది. ఇక నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఓట్లలో కారుదే పైచేయి అయినా.. ఈ సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. అంటే.. శాసనసభ ఎన్నికలు జరిగిన ఐదు నెలల వ్యవధిలోనే ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నా కూడా బీఆర్‌ఎ్‌సను కాదని.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రె్‌సలకు ఓటర్లు మద్దతు పలికారు. ఇందుకు పలు కారణాలను విశ్లేషకులు ఉదహరించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడం, అది కూడా 2014 కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకత్వం అతివిశ్వాసానికి పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


గతం కన్నా బలహీనంగా బీఆర్‌ఎ్‌స..శ్రీ

గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి బీఆర్‌ఎస్‌ బలహీనపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో ఆ నిష్పత్తి ప్రకారం 5 నుంచి 6 ఎంపీ సీట్లను ఆ పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఓట్లపరంగా కూడా 7 పార్లమెంటు స్థానాల పరిధిలో బీఆర్‌ఎ్‌సకు ఆధిక్యం లభించింది. కానీ, తాజా ఎన్నికల్లో ఆ పరిస్థితులు లేవని పలు సర్వేలు చెబుతున్నాయి. ఏబీపీ సీ ఓటరు, ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌, న్యూస్‌ 18 వంటి సంస్థలు.. తాము నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో కేసీఆర్‌ పార్టీకి ఒకటి, రెండు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడైనట్లు తెలిపాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు కాంగ్రె్‌సలోకి క్యూ కట్టడం, ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేసినవారు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం వంటివి బీఆర్‌ఎస్‌ బలహీనపడిన విషయాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నాయి. అయితే సర్వేల నివేదికలు ఎలా ఉన్నా.. వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయో తేలాలంటే మాత్రం జూన్‌ 4 దాకా వేచి చూడాల్సిందే.

Updated Date - May 07 , 2024 | 05:32 AM