మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్
ABN , Publish Date - Oct 08 , 2024 | 03:04 AM
వైద్య రంగంలో అందించిన విశేష సేవలకుగానూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది.
అమెరికా శాస్త్రవేత్తలు ఆంబ్రోస్, రువ్‌కున్‌కు అత్యున్నత పురస్కారం
జన్యు నియంత్రణలో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర విశ్లేషణకు దక్కిన గౌరవం
అమెరికా శాస్త్రవేత్తలు ఆంబ్రోస్, రువ్‌కున్‌కు పురస్కారం
స్టాక్‌హోం, అక్టోబరు 7: వైద్య రంగంలో అందించిన విశేష సేవలకుగానూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ, జన్యు నియంత్రణలో దాని పాత్రను వివరించినందుకు గానూ వారికి ఈ అవార్డు దక్కినట్టు స్వీడన్‌లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది.
ప్రస్తుతం మసాచుసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో నేచురల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆంబ్రో్సకు.. హార్వర్డ్ యూనివర్సిటీలో చేసిన పరిశోధనకు గానూ ఈ బహుమతి దక్కింది. జన్యుశాస్త్ర ప్రొఫెసర్ అయిన్ రువ్కున్ మసాచుసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్, హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో పరిశోధనలు చేశారని నోబెల్ అవార్డుల కమిటీ సెక్రటరీ థామస్ పెర్ల్మన్ తెలిపారు. కాగా, ఈ అవార్డు కింద ఆంబ్రోస్, రువ్‌కున్‌లకు సుమారు రూ.8.91 కోట్లు నగదు బహుమతి దక్కనుంది. కాగా, మంగళవారం భౌతికశాస్త్రంలో, బుధవారం రసాయనశాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతులు ప్రకటిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం.. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార విజేతలను ఈనెల 14న వెల్లడిస్తారు.