Share News

US Elections 2024 : నువ్వా.. నేనా.. రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:30 AM

ఎన్నికలంటే.. ప్రజలే తమ ప్రభువులను ఎన్నుకునే ప్రజాస్వామ్య పండగ! అయితే, ఎన్నికలు ఒక్కో దేశంలో ఒక్కోలా జరుగుతాయి. మనదేశంలో 51 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధిస్తే..

US Elections 2024 : నువ్వా.. నేనా.. రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు

  • సుదీర్ఘంగా.. సంక్లిష్టంగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ

  • అన్ని రాష్ట్రాల మద్దతున్నవారే ప్రెసిడెంట్‌ కావాలనే లక్ష్యంతో ఎలక్టోరల్‌ కాలేజీవిధానం.. కానీ స్వింగ్‌ రాష్ట్రాలే కీలకం

  • మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో 119 స్వింగ్‌ రాష్ట్రాలవే

  • 2016 ఎన్నికల్లో.. ఆ ఏడు రాష్ట్రాలూ దక్కించుకున్న ట్రంప్‌

  • 2020లో వాటిల్లో ఆరింటిని కైవసం చేసుకున్న జో బైడెన్‌

  • ఈసారి ఆ రాష్ట్రాల్లో ట్రంప్‌, కమల మధ్య హోరాహోరీ పోరు

పేరుకు అధ్యక్ష ఎన్నికలేగానీ.. అమెరికా ప్రజల ఓట్లు ఎక్కువగా సాధించిన అభ్యర్థి ప్రెసిడెంట్‌ కారు. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువగా వచ్చిన అభ్యర్థి మాత్రమే శ్వేత సౌధానికి అధిపతి అవుతారు! అదేదో సినిమాలో డైలాగులాగా.. ‘‘జనం ఓట్లు ఎన్నొచ్చాయన్నది కాదన్నయ్యా.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎన్నొచ్చాయనేదే లెక్క’’ అన్నమాట! ఉదాహరణకు.. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ కన్నా డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28.6 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి! కానీ.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువ వచ్చిన ట్రంపే అధ్యక్షుడయ్యారు! ‘‘విన్నర్‌ టేక్స్‌ ఆల్‌’’ అనే విధానం వల్ల జరిగే మ్యాజిక్‌ ఇది. అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిని ఎంచుకునే ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఆ కథాకమామీషూ.. అధ్యక్ష ఎన్నికల్లో సిత్రాలపై ప్రత్యేక కథనం

  • ముందస్తు ఓటింగ్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేది నవంబరులో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే! కానీ.. దానికి నెలన్నర ముందు నుంచే ‘ఎర్లీ ఓటింగ్‌’ పేరుతో ముందస్తుగా ఓటు వేసే అవకాశాన్ని పౌరులకు కల్పిస్తారు. ఈ ‘ముందస్తు ఓటింగ్‌ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి.. మెయిల్‌ బ్యాలెట్ల ద్వారా, రెండోది మామూలు పోలింగ్‌ కేంద్రాల ద్వారా. ఈసారి అక్టోబరు 20 నాటికే 2.1 కోట్ల మంది అమెరికన్లు ముందస్తుగా ఓటును వినియోగించుకోవడం విశేషం.


న్నికలంటే.. ప్రజలే తమ ప్రభువులను ఎన్నుకునే ప్రజాస్వామ్య పండగ! అయితే, ఎన్నికలు ఒక్కో దేశంలో ఒక్కోలా జరుగుతాయి. మనదేశంలో 51 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధిస్తే.. అమెరికాలో ఒక రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి, ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు మొత్తం దఖలు పడతాయి. అలా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువ వచ్చిన అభ్యర్థి ‘అంకుల్‌ శామ్‌ (అమెరికన్లు ముద్దుగా తమ అధ్యక్షుణ్ని ఇలాగే పిలుచుకుంటారు. ‘మరి ఒక మహిళ ప్రెసిడెంట్‌ అయితే?’ అంటారా అని అడిగితే.. ఇప్పటిదాకా మహిళలెవరూ ప్రెసిడెంట్‌ కాలేదు కాబట్టి ఆ మీమాంస వారికి రాలేదు. ఈసారి కమలా హ్యారిస్‌ గెలిస్తే.. ఆ సందేహం వచ్చే అవకాశం ఉంది) అవుతారు. అసలు అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండడానికే అక్కడ చాలా పెద్ద తతంగం ఉంటుంది.

మనదగ్గర ఎన్నికల షెడ్యూలు వెలువడగానే.. రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయి. కానీ.. అమెరికాలో అధ్యక్ష పదవి రేసులో ఉండడానికే సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. పార్టీ నుంచి ప్రెసిడెన్షియల్‌ క్యాండిడేట్‌గా పోటీ పడేందుకు ఒకరికన్నా ఎక్కువ మంది ముందుకొస్తే వారిలో ఎవరిని అభ్యర్థిగా ఎంచుకోవాలో నిర్ణయించుకునేందుకు ప్రైమరీలు, కాక్‌సలు నిర్వహిస్తారు. వీటిలో కాకస్‌ అంటే.. పార్టీ సభ్యులు బృందాలుగా విడిపోయి చర్చలు, ఓట్ల ద్వారా ఉత్తమ అభ్యర్థిని ఎంచుకుంటారు. ప్రైమరీలంటే.. తమకు నచ్చిన అధ్యక్ష అభ్యర్థికి బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసి మద్దతు తెలిపే ప్రక్రియ. ఈ ప్రైమరీలు, కాక్‌సలు ముగిశాక.. ప్రతి పార్టీ అంతర్గతంగా జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి తమ అభ్యర్థిని ఎంచుకుని, ప్రకటిస్తుంది. సదరు అధ్యక్ష అభ్యర్థులు.. తమ రన్నింగ్‌ మేట్‌ను (అంటే ఉపాధ్యక్ష అభ్యర్థిని) ప్రకటిస్తారు.


అనంతరం అసలు ఎన్నికల ప్రచారం షురూ అవుతుంది. అన్నిపార్టీల అధ్యక్ష అభ్యర్థులూ దేశమంతా తిరుగుతూ ప్రజల మద్దతు పొందేందుకు ప్రచారం చేస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, దేశ రక్షణ, విదేశాంగ విధానం, తదితర అంశాలపై తమ అభిప్రాయాలు, విధానాలను బహిరంగంగా తెలుపుతారు. ఇందుకోసం ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మూడు ముఖాముఖి చర్చలు జరుగుతాయి. ఆ డిబేట్లలో ఆయా అభ్యర్థుల వైఖరి, వారి ఆలోచనసరళి ఆధారంగా చాలా మంది తటస్థులు తాము ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకుంటారు.

ఆ తర్వాత అసలు దశ.. నవంబరులో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం (తొలి మంగళవారం కాదు) పోలింగ్‌ జరుగుతుంది. ఉదాహరణకు నవంబరు 1వ తేదీ మంగళవారం అయితే.. ఆ నెలలో వచ్చే మొదటి సోమవారం 7వ తేదీ అవుతుంది. అప్పుడు.. అధ్యక్ష ఎన్నికను నవంబరు 8న నిర్వహిస్తారు. అలా ఈసారి నవంబరులో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం 5వ తేదీ అయ్యింది. కాబట్టి ఆరోజు ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు.


  • ఎలక్టర్లకు ఓటు..

ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసేది నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు కాదు. రిపబ్లికన్‌ లేదా డెమోక్రాటిక్‌ లేదా ఇతర, స్వతంత్ర పార్టీల ప్రతినిధులకుఓటేస్తారు. ఆ ప్రతినిధులను ‘ఎలక్టర్‌’లంటారు. మనదేశంలో.. జనాభా ఆధారంగా రాష్ట్రాల ఎంపీల సంఖ్య ఉన్నట్టే, అమెరికాలోని 50 రాష్ట్రాలకూ కాంగ్రె్‌సలో ఉన్న ప్రతినిధుల సంఖ్య ఆధారంగా ఎలక్టర్ల సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు.. క్యాలిఫోర్నియా రాష్ట్రానికి అత్యధికంగా 55 మంది ఎలక్టర్లున్నారు. టెక్సా్‌సకు 38 మంది ఎలక్టర్లున్నారు. ఇలా 50 రాష్ట్రాలకూ కలిపి మొత్తం 538 మంది ఎలక్టర్లుంటారు. వీరిలో 270 మంది మద్దతు పొందినవారు అధ్యక్ష పీఠాన్ని అధివసిస్తారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే.. మెయిన్‌, నెబ్రాస్కా రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో విషయంలో గెలిచిన పార్టీకే మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లు దక్కుతాయి (విన్నర్‌ టేక్స్‌ ఆల్‌). ఉదాహరణకు క్యాలిఫోర్నియా ప్రజల్లో సగానికంటే ఎక్కువ మంది డెమొక్రాట్‌ అభ్యర్థికి ఓటు వేస్తే.. మొత్తం 55 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లూ డెమొక్రాట్ల ఖాతాలో పడిపోయినట్టే. దీనివల్ల.. ఓట్లు ఎక్కువ వచ్చినా కొందరు అభ్యర్థులు అధ్యక్షులు కాలేకపోయారు. 2000 సంవత్సరంలో అల్‌గోరె, 2016లో హిల్లరీ ఇలాగే ప్రజల ఓట్లు ఎక్కువ వచ్చినా, ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు తక్కువ రావడంతో పరాజితులుగా మిగిలిపోయారు.


  • కంచుకోటలు..

మనదగ్గర పార్టీలకు కంచుకోటలుగా పేరుబడిన నియోజకవర్గాలు ఉన్నట్టే.. అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్లకు, కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్లకు కంచుకోటల్లా పేరొందాయి. అలా ఏ పార్టీవైపు ఇదమిత్థంగా మొగ్గుచూపని రాష్ట్రాలు ఏడున్నాయి. వాటిని ‘స్వింగ్‌’ రాష్ట్రాలంటారు. శ్వేతసౌధంలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే ఆ ఏడు రాష్ట్రాలూ.. ఫ్లోరిడా (29), పెన్సిల్వేనియా (20), ఒహాయో (18), మిషిగన్‌ (16), ఉత్తర కరొలినా (15), అరిజోనా (11), విస్కాన్సిన్‌ (10). ఈ ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 119 ఎలక్టొరల్‌ ఓట్లు ఉన్నాయి. అయోవా (6) కూడా అలాంటిదే. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటుంది. దీనివల్ల అక్కడ ఓట్ల లెక్కింపు కూడా బాగా ఆలస్యమవుతుంటుంది. 2016 ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడు రాష్ట్రాల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేశారు. మిగతా రాష్ట్రాల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ గట్టి ప్రభావం చూపినా.. ఈ ఏడు రాష్ట్రాల్లోని 119 ఎలక్టోరల్‌ ఓట్లను కోల్పోవడం ద్వారా అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. ట్రంప్‌ కంటే ఆమెకు 28.68 లక్షల ఓట్లు అధికంగా వచ్చినా.. విజయానికి కావలసిన 270 ఎలక్టరల్‌ ఓట్లు పొందడంలో విఫలమయ్యారు. ఈసారి స్వింగ్‌ రాష్ట్రాల్లో కమల, ట్రంప్‌ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


  • సుదీర్ఘంగా..

అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీరు ఆధారంగా.. గెలిచేది ఎవరనే విషయంపై రాజకీయ విశ్లేషకులు 24 గంటల్లోనే ఒక నిర్ణయానికి వస్తారు. కానీ.. అధికారికంగా కొంత ప్రక్రియ మిగిలే ఉంటుంది. అది నవంబరు రెండోవారం నుంచి డిసెంబరు రెండోవారం దాకా జరుగుతుంది. డిసెంబరులో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారంనాడు (ఈ ఏడాది అది డిసెంబరు 16 అయింది) ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు (ఎలక్టర్లు) తమతమ రాష్ట్రాల్లో సమావేశమై అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు ఓటేస్తారు. అంటే.. అధ్యక్ష అభ్యర్థిని నేరుగా ఎంచుకునే ప్రక్రియ జరిగేది ఆ రోజన్నమాట. ఎలక్టర్లు ఓటు వేసిన 9 రోజుల లోపు ఆ ఓట్లన్నీ (సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ ఓట్స్‌) సెనెట్‌ అధ్యక్షుడికి చేరాలి. జనవరి 6న.. మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ఎలక్టోరల్‌ ఓట్లను లెక్కించి, విజేత ఎవరో సెనేట్‌ అధ్యక్షుడు ప్రకటిస్తారు. జనవరి 20న అధ్యక్ష, ఉపాధ్యక్షులు బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పుడు కొత్త ప్రెసిడెంట్‌.. ‘రాజు వెడలె రవితేజములలరగ..’ అన్న చందంగా సగర్వంగా శ్వేతసౌధంలోకి అడుగుపెడతారు.

- సెంట్రల్‌ డెస్క్‌


  • అధ్యక్షుడు+ఉపాధ్యక్షుడు= టికెట్‌

ఇద్దరు వ్యక్తులను కలిపి చెప్పడానికి మనం ‘ద్వయం’ అన్నట్టే.. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులిద్దరినీ కలిపి ‘టికెట్‌’గా వ్యవహరిస్తారు!

  • కుబేరులు.. అటూ ఇటూ!

పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్న వ్యాపారులు రాజకీయ పార్టీలకు విరాళాలు ప్రకటించడం మనకు కొత్తేం కాదు! అమెరికాలోనూ అంతే. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వంటి సంస్థలతో ప్రపంచప్రఖ్యాతిగాంచిన అపర కుబేరుడు ఈలన్‌ మస్క్‌ రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుతోపాటు ఆర్థిక సాయమూ ప్రకటిస్తే.. మరో కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కమలకు పరోక్ష మద్దతు ప్రకటించారు. వీరే కాదు.. ఎంతోమంది బిలియనీర్లు వీరిద్దరిలో తమకు నచ్చినవారికి మద్దతుగా విరాళాలిచ్చారు. అయితే, ట్రంప్‌తో పోలిస్తే.. ఎక్కువ మంది బిలియనీర్ల మద్దతు కమలాహ్యారి్‌సకే ఉండడం గమనార్హం. ఫోర్బ్స్‌ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 81 మంది కోటీశ్వరుల మద్దతు కమలకు ఉండగా, ట్రంప్‌కు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కుబేరులు 51 మంది దాకా ఉన్నారు. కమలకు మద్దతిస్తున్న బిలియనీర్లలో 28 మంది కనీసం 10 లక్షల డాలర్లు ఆమెకు విరాళంగా ప్రకటించారు. ఆమెకు మద్దతుగా ఉన్నవారిలో ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్‌ కూడా ఉండడం విశేషం. ఇక ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన కోటీశ్వరుల్లో 26 మంది ఆయనకు 10 లక్షల డాలర్లు అంతకన్నా ఎక్కువ విరాళం ఇచ్చారు. ఆయనకు ఈలన్‌ మస్క్‌, మిరియం అడెల్సన్‌, డిక్‌ యుహ్లీన్‌ అనే ముగ్గురు కోటీశ్వరుల నుంచి వచ్చిన విరాళమే 22 కోట్ల డాలర్లు కావడం గమనార్హం. అమెరికాలోని 971 మంది పెట్టుబడిదారులైన మిలియనీర్లు, బిలియనీర్లను ప్రశ్నించగా.. వారిలో 57 శాతం మంది కమలవైపు మొగ్గుచూపారు. 43 శాతం మందే ట్రంప్‌ కావాలన్నారు.


  • రూ.5,323 కోట్లు!

కమలా హ్యారిస్‌ ఫండ్‌రైజింగ్‌ కమిటీ ఇప్పటిదాకా ఆమె ఎన్నికల ప్రచారం కోసం జూలై నుంచి సెప్టెంబరు చివరినాటికి 63.3 కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5323 కోట్లు. అంతకుముందు బైడెన్‌ అభ్యర్థిగా ఉన్న సమయంలో వచ్చిన విరాళాలను కూడా కలుపుకొంటే ఆ మొత్తం దాదాపుగా రూ.8 వేల కోట్లు. అదే సమయంలో.. ట్రంప్‌ నిధుల సేకరణ 14.5 కోట్ల డాలర్లే. అంటే.. దాదాపు రూ.3,090 కోట్లే!!

  • వీళ్లూ ఉన్నారు

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో ట్రంప్‌, కమలా హ్యారిసే కాదు.. వేరే పార్టీలకు చెందినవారు, స్వతంత్రులు కూడా ఉన్నారు. గ్రీన్‌ పార్టీకి చెందిన జిల్‌ స్టీన్‌, లిబర్టేరియన్‌ పార్టీకి చెందిన చేజ్‌ ఒలివర్‌ వంటివారు కూడా ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ తమ్ముడి కుమారుడు రాబర్ట్‌ ఎఫ్‌ కెనెడీ జూనియర్‌ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆ తర్వాత ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.

Updated Date - Oct 27 , 2024 | 09:30 AM