Share News

Experts: యుద్ధమా? దాడులతో సరా?

ABN , Publish Date - Oct 28 , 2024 | 03:35 AM

‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్‌ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 100 ఫైటర్‌ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!

 Experts: యుద్ధమా?  దాడులతో సరా?

  • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ సంఘర్షణ పూర్తిస్థాయి సమరంగా మారుతుందా?

  • కాల్బలం, యుద్ధట్యాంకుల్లో ఇరాన్‌ పైచేయి

  • టెక్నాలజీ, గగనతల రక్షణలో ఇజ్రాయెల్‌ టాప్‌

  • ఇప్పటికే ఏడు ముఖాల పోరుతో సతమతం

  • ఆ దేశ ప్రజల్లో యుద్ధం పట్ల వ్యతిరేకత

  • ఇజ్రాయెల్‌ రక్షణ సామర్థ్యాన్ని గుర్తించిన ఇరాన్‌

  • యుద్ధం ముప్పు తక్కువని నిపుణుల అంచనా

  • ప్రతీకార దాడులతోనే సరిపెట్టే అవకాశం!

‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్‌ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 100 ఫైటర్‌ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు! ఈ దెబ్బతో.. ఇరాన్‌ క్షిపణి తయారీ కేంద్రాలు మళ్లీ యథావిధిగా పనిచేయడానికి ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని అంచనా!! దీనిపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ స్పందిస్తూ.. తమ శక్తిని ఇజ్రాయెల్‌కు రుచిచూపిస్తామని ప్రకటించారు! అయితే.. ఎలాంటి దాడులు చేయాలనే అంశంపై సైన్యం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగే ప్రమాదం ఉందా? అనే ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతోంది. కానీ.. ఖమేనీ వ్యాఖ్యలను, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన ప్రతీకార దాడుల తీరును పరిశీలిస్తే రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగే ముప్పు తక్కువనే అభిప్రాయాన్ని రక్షణ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్తే దెబ్బ తింటామనే విషయం రెండు దేశాలకూ తెలుసు.

Untitled-2 copy.jpg


మరీ ముఖ్యంగా.. నిరుడు అక్టోబరులో హమాస్‌ కిరాతకదాడితో మొదలైన యుద్ధంలో తాము ఏడుగురు శత్రువులతో పోరాడుతున్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కొద్దిరోజుల క్రితమే అన్నారు! ఆ ఏడుగురు శత్రువులూ.. గాజాలో హమాస్‌, లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హౌతీలు, వెస్ట్‌బ్యాంక్‌లో ఉగ్రవాదులు, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలకు చెందిన షియా మిలిటెంట్లు. వారిలో హెజ్బొల్లా, హౌతీ, షియా మిలిటెంట్లు ఇరాన్‌ ప్రాక్సీలే. ఒకవైపు వీరందరితో పోరాడుతూ మరోవైపు ఇరాన్‌తో నేరుగా యుద్ధంలోకి దిగడం ఇజ్రాయెల్‌కు అంతమంచిది కాదు.

అందునా.. ఇప్పటికే ఏడాదికాలంగా నెలకొన్న యుద్ధవాతావరణంతో ఇజ్రాయెలీలు విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి యుద్ధమంటే ప్రజల మద్దతు ఉండదు. ఇక, ఇజ్రాయెల్‌తో పోలిస్తే.. సంఖ్యలో ఇరాన్‌ వద్ద భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నా, పటిష్ఠమైన ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ ముందు వాటి శక్తి తక్కువే. అక్టోబరు 1న జరిపిన దాడితోనే ఇరాన్‌కు ఆ విషయం అర్థమైంది. కాబట్టి.. రెండు దేశాలూ ఇలాగే అప్పుడప్పుడూ ప్రతీకార దాడులతో సరిపెట్టే అవకాశం ఉందని అంచనా! అలాగని పూర్తిస్థాయి యుద్ధం జరిగే ప్రమాదాన్నీ కొట్టిపారేయలేం. అదే జరిగితే అందులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరి బలం, బలగం ఎంత? పరిశీలిస్తే..


  • బాలిస్టిక్‌ క్షిపణులు

ఇరాన్‌ వద్ద 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపైన కూడా దాడులు చేయగలిగే పలు శ్రేణుల క్షిపణులు 3,500 దాకా ఉన్నాయి. అందులో కొన్ని 500 కిలోల బరువున్న ఆయుధాలను కూడా మోసుకెళ్లగలవు. ఇటీవలే.. ఫతా పేరుతో హైపర్‌సానిక్‌ క్షిపణులను కూడా రంగంలోకి దించింది. వేల సంఖ్యలో డ్రోన్లను కూడా అభివృద్ధి చేసుకుంది. ఇరాన్‌ క్షిపణుల్లో చాలావరకూ ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఉన్నవి. మరోవైపు, ఇజ్రాయెల్‌ వద్ద.. 4,800 నుంచి 6,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల అత్యంత అధునాతనమైన, శక్తిమంతమైన క్షిపణులున్నాయి. ఇజ్రాయెల్‌ వద్ద ఉన్న హెరాన్‌ డ్రోన్లు నిరంతరాయంగా 30 గంటలపాటు ప్రయాణించగలవు.


  • అణ్వాయుధాలు

ఇజ్రాయెల్‌ వద్ద 90 న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉన్నట్టు సమాచారం. ఇరాన్‌ వద్ద ప్రస్తుతానికి అణ్వాయుధాలు లేవుగానీ.. వారి అణు కార్యక్రమం చాలా అడ్వాన్స్‌డ్‌ దశలో ఉంది. పౌర అవసరాల నిమిత్తమే అణు కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్న ఇరాన్‌ వద్ద నాలుగు అణ్వాయుధాలు తయారుచేయడానికి సరిపడా అణు పదార్థం (నియర్‌ వెపన్స్‌ గ్రేడ్‌ మెటీరియల్‌) ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి అణు సంస్థ చెబుతోంది. అయితే.. అణ్వాయుధాలు తయారీకి అవసరమైన పరిజ్ఞానం తమ వద్ద ఉందని.. జనహనన ఆయుధాలను తయారుచేయబోమన్న తమ వైఖరిని అవసరమైతే ఏ క్షణమైనా మార్చుకుంటామని ఇరాన్‌ ఇటీవలికాలంలో హెచ్చరించడం గమనార్హం.


  • గగనతల రక్షణ వ్యవస్థలు

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న దేశం ఇజ్రాయెల్‌. ఆ దేశ ‘ఐరన్‌ డోమ్‌’, ‘డేవిడ్స్‌ స్లింగ్‌’, ‘యారో’ వ్యవస్థల సత్తా గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసు. గతంలో ఇరాన్‌ కురిపించిన క్షిపణులు, డ్రోన్ల వర్షాన్ని ఇజ్రాయెల్‌ వీటి ద్వారానే సమర్థంగా ఎదుర్కొంది. ఇక, ఇరాన్‌ విషయానికి వస్తే.. ఆ దేశం రష్యన్లు రూపొందించిన ఎస్‌-200, ఎస్‌-300లతోపాటు, స్థానికంగా అభివృద్ధి చేసుకున్న బవర్‌-373లపై ఆధారపడింది.

కానీ, తాజా దాడితో ఇజ్రాయెల్‌.. ఆ వ్యవస్థలను ఛేదించి మరీ ఇరాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లేలా చేయగలిగింది. ఇక.. ఇరు దేశాల సైనికశక్తి, యుద్ధ ట్యాంకులు, శతఘ్నుల వంటివాటిని చూస్తే.. అంకెల పరంగా అన్నింటా ఇరాన్‌దే పైచేయిగా కనిపించవచ్చుగానీ, టెక్నాలజీ, రక్షణ ఖర్చు, వైమానిక శక్తి, బాలిస్టిక్‌ క్షిపణులు, అణ్వాయుధాల పరంగా చూస్తే ఇజ్రాయెల్‌ శక్తి చాలా ఎక్కువ. రెండువేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఈ రెండు దేశాల సైన్యాలూ తలపడడం కల్ల! ఇక మిగిలింది వైమానిక, క్షిపణి దాడులే.

ఆ విషయంలో ఇజ్రాయెల్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఇరాన్‌ వద్ద ఎఫ్‌-4, ఎఫ్‌-14, సుఖోయ్‌-24, మిగ్‌-29ఎస్‌ యుద్ధవిమానాలున్నాయి (అమెరికాకు ప్రస్తుతం బద్ధశత్రువుగా ఉన్న ఇరాన్‌కు ఎఫ్‌-14 యుద్ధవిమానాలు ఎలా వచ్చాయంటే.. 1972లో ఇరాన్‌ రాజు షాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 80కిగాను.. 79 ఎఫ్‌-14 యుద్ధవిమానాలను అమెరికా సరఫరా చేసింది. మరో ఎఫ్‌-14ను సరఫరా చేసే సమయానికి అక్కడ ఇస్లామిక్‌ విప్లవం రావడంతో దాన్ని విరమించుకుంది).


వీటిలో ఎఫ్‌-4, ఎఫ్‌-14, సుఖోయ్‌ 24 యుద్ధవిమానాలు చాలా పాతవి. వాటితో పోలిస్తే.. ఇజ్రాయెల్‌ వద్ద అత్యంత అధునాతనమైన ఎఫ్‌-15, ఎఫ్‌-16, ఎఫ్‌-35లున్నాయి. కాబట్టి ఇరాన్‌ ఆచితూచి స్పందిస్తుందనే ఆశించవచ్చు. ఇజ్రాయెల్‌ కూడా పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేదు కాబట్టి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Untitled-2 copy.jpg

Untitled-2 copy.jpg

Updated Date - Oct 28 , 2024 | 03:43 AM