Share News

US News: రివర్స్ మోడ్‌లో కారు.. ఇంతలో అనుకోని ఘోరం.. ప్రాణాలు విడిచిన సీఈవో

ABN , Publish Date - Mar 10 , 2024 | 05:09 PM

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని ఊహించని ప్రమాదాల్లో పడేస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఓ కంపెనీ సీఈవో సైతం.. ఓ చిన్న తప్పుకి బలైపోయింది. పొరపాటున తన కారు మోడ్‌ని రివర్స్‌లోకి మార్చడంతో.. అనుకోని ప్రమాదం సంభవించింది.

US News: రివర్స్ మోడ్‌లో కారు.. ఇంతలో అనుకోని ఘోరం.. ప్రాణాలు విడిచిన సీఈవో

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని ఊహించని ప్రమాదాల్లో పడేస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఓ కంపెనీ సీఈవో సైతం.. ఓ చిన్న తప్పుకి బలైపోయింది. పొరపాటున తన కారు మోడ్‌ని రివర్స్‌లోకి మార్చడంతో.. అనుకోని ప్రమాదం సంభవించింది. ఇదే క్రమంలో కారు అద్దాలు కూడా బద్దలవ్వకపోవడంతో ఆమె మృత్యువాత పడింది. ఈ ఘటన అమెరికాలో (America) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


అమెరికాలో ఉన్న అత్యంత సంపన్నుల్లో చావో ఫ్యామిలీ (Chao Family) ఒకటి. ఈ కుటుంబానికి చెందిన ఏంజెలా చావో (Angela Chao) (50) ప్రముఖ షిప్పింగ్‌ కంపెనీ ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌కు (Foremost Group) సీఈవోగా వ్యవహరిస్తోంది. శుక్రవారం రాత్రి ఆమె హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లోని తన స్నేహితులతో కలిసి.. టెక్సాస్‌లోని ఆస్టిన్‌ సమీపంలో ఉన్న తన ప్రైవేటు అతిథి గృహానికి వెళ్లారు. అనంతరం ఒక రెస్టారెంట్‌లో రాత్రి వరకు గడిపింది. ఆ తర్వాత తన టెస్లా ఎక్స్ ఎస్‌యూవీ కారులో (Tesla X SUV Car) తిరిగి తన భవనానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఒక త్రీపాయింట్‌ టర్న్‌ వచ్చినప్పుడు.. దాన్ని దాటేందుకు ఏంజెలా పొరబాటున తన కారుని రివర్స్ మోడ్‌లోకి మార్చింది. అంతే.. అది వేగంగా వెనక్కి వెళ్లి ఓ కొలనులో బోల్తా పడింది.

ఈ పరిణామంతో భయబ్రాంతులకు గురైన ఏంజెలా.. వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. దీంతో.. ఆ స్నేహితురాలితో పాటు అతిథి గృహం మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే.. వీళ్లు అక్కడికి చేరుకునేలోపే ఏంజెలా కారు నీటిలో మునిగిపోయింది. ఆమెని రక్షించేందుకు వాళ్లు ఎంతో ప్రయత్నించారు. కారు అద్దాలు కూడా బద్దలుకొట్టేందుకు ట్రై చేశారు. కానీ.. అవి బలంగా ఉండటంతో బద్దలవ్వలేదు. చివరికి మరో వాహనం సహాయంతో కారుని బయటకు తీశారు. కానీ.. అప్పటికే ఏంజెలా మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా.. సెనేట్ రిపబ్లికన్ లీడర్ మిచ్ మెక్‌కానెల్‌కు ఏంజెలా మరదలు వరుస అవుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 05:09 PM