Share News

Gaza : గాజాపై మరో భీకర దాడి!

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:35 AM

మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్‌ గాజాలోని తబీన్‌ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్‌సపై పది నెలలుగా టెల్‌ అవీవ్‌ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.

 Gaza : గాజాపై మరో భీకర దాడి!

  • పాఠశాలలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ క్షిపణులు!.. దాదాపు వందమంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

  • అది బడి కాదు.. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌: ఇజ్రాయెల్‌

గాజా, ఆగస్టు 10: మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్‌ గాజాలోని తబీన్‌ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్‌సపై పది నెలలుగా టెల్‌ అవీవ్‌ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఇందులో వందమంది వరకు మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హెజ్బొల్లా, ఇరాన్‌ నుంచి తీవ్రస్థాయి హెచ్చరికలు ఎదుర్కొంటున్న సమయంలో ఇజ్రాయెల్‌ భారీ దాడికి పాల్పడడం ఉద్రిక్తతలను మరింత పెంచేదిగా భావిస్తున్నారు.

తబీన్‌ పాఠశాల 6 వేలమంది తలదాచుకుంటున్న శరణార్థి శిబిరమని హమాస్‌ పేర్కొంటుండగా, అది సీనియర్‌ కమాండర్లు సహా 20 మంది ఉగ్రవాదులు నక్కిన హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ అని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. ఈ పాఠశాల మసీదు పక్కనే ఉందని తెలిపింది. మసీదు, తరగతి గదులు ఒకే భవనంలో ఉన్నాయని అసోసియేటెడ్‌ ప్రెస్‌ కెమెరామెన్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌ క్షిపణి తరగతి గదుల మీదుగా మసీదులోకి చొచ్చుకెళ్లి పేలిపోయిందని పేర్కొన్నారు. కాగా, దాడి జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తమై పరిస్థితి భీతావహంగా ఉంది. భారీ భవనం గోడలు నేలమట్టమై శరీరాలు ఛిధ్రమయ్యాయి.


వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తమ వద్దకు 70 మృతదేహాలు, మరో పదిమంది శరీర భాగాలు వచ్చాయని అల్‌ అహిల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ ఫదెల్‌ నయీం తెలిపారు. 47 మందికి తీవ్రగాయాలైనట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, తెల్లవారక ముందే.. స్కూల్‌లోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ దాడికి దిగిందని అబు అనాస్‌ అనే స్థానికుడు తెలిపాడు.

కొందరు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని వాపోయాడు. మృతుల్లో అధికులు మహిళలు, పిల్లలు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. సోమవారం ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నెల రోజుల్లో 17 పాఠశాలలపైన ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. గత 15 రోజుల్లోనే ఏడు దాడులకు పాల్పడింది. వీటిలో అధిక శాతం శరణార్థి శిబిరాలేనని.. మొత్తం 163 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని ఈయూ విదేశీ వ్యవహారాల అధిపతి జొసెప్‌ బొరెల్‌ ఖండించారు.

Updated Date - Aug 11 , 2024 | 04:35 AM