Hungary: కొంప ముంచిన క్షమాభిక్ష.. అధ్యక్ష పదవికి రాజీనామా..
ABN , Publish Date - Feb 11 , 2024 | 10:38 AM
సమాజంలో జరిగే నేరాలను ఉపేక్షిస్తే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే హత్యలు, దోపిడీలు, లైంగిక దాడుల కేసుల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక చిన్నారులపై లైంగిక దాడి జరిగిందంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
సమాజంలో జరిగే నేరాలను ఉపేక్షిస్తే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే హత్యలు, దోపిడీలు, లైంగిక దాడుల కేసుల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక చిన్నారులపై లైంగిక దాడి జరిగిందంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానమేనని అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. కానీ.. ఓ నేరం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం మొదటికే మోసం వచ్చింది. ఏకంగా దేశ అధ్యక్ష పదవినే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో ఓ నిందితుడికి హంగేరీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాల విమర్శలతో ఆ దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ తన పదవికి రాజీనామా చేశారు.
హంగేరీ ప్రభుత్వాధికారం ఆ దేశ ప్రధాని చేతుల్లో ఉంటుంది. అధ్యక్షులకు అధికారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. మార్చి 2022లో కటాలిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రథమ మహిళ కటాలిన్ కావడం విశేషం. కొంతకాలం క్రితం ఓ బాలల సంరక్షణాలయ ప్రధాన అధికారి అక్కడి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అధికారికి సహకరించిన మరో ఉద్యోగికి ప్రభుత్వ సూచన మేరకు అధ్యక్షురాలు క్షమాభిక్ష ప్రసాదించడం తాజా పరిస్థితికి కారణయ్యింది.
ఈ తతంగం తాజాగా బయటకు రావడంతో హంగేరీలో కలకలం రేగింది. క్షమాభిక్ష ఎలా ప్రసాదిస్తారంటూ ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అధ్యక్ష నివాసం ముందు సైతం ధర్నాకు దిగారు. నిరసనల విషయం తెలియగానే ఖతర్ లో ఉన్న అధ్యక్షురాలు కటాలిన్ స్వదేశానికి చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
అధ్యక్షురాలి రాజీనామాతో శాంతించని నిరసనకారులు ప్రధాని సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కొసమెరుపు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.