Share News

Rocket Attacks: ఇజ్రాయెల్‌ 7 హెజ్బొల్లా..

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:09 AM

దాదాపు పది నెలలుగా ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా.. ఆదివారం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది! హెజ్బొల్లా నేత ఫవాద్‌ షుకూర్‌ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై కత్యూష రాకెట్లతో, డ్రోన్లతో దాడి చేయడానికి ఆ సంస్థ సిద్ధమైంది.

Rocket Attacks: ఇజ్రాయెల్‌ 7 హెజ్బొల్లా..

  • 320కి పైగా కత్యూష రాకెట్లు, డ్రోన్లతో

  • దాడికి సిద్ధమైన హెజ్బొల్లా

  • ముందే పసిగట్టి 100 ఫైటర్‌ జెట్లతో

  • విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ సైన్యం

  • దాడుల్లో లెబనాన్‌లో ముగ్గురి మృతి

  • ఐరన్‌ డోమ్‌ ప్లాట్‌ఫారాలే లక్ష్యంగా

  • రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బొల్లా

జెరూసలెం, ఆగస్టు 25: దాదాపు పది నెలలుగా ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా.. ఆదివారం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది! హెజ్బొల్లా నేత ఫవాద్‌ షుకూర్‌ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై కత్యూష రాకెట్లతో, డ్రోన్లతో దాడి చేయడానికి ఆ సంస్థ సిద్ధమైంది. అయితే, ఈ విషయాన్ని నిఘా వర్గాల ద్వారా ముందుగానే పసిగట్టిన ఇజ్రాయెల్‌.. ముందస్తు దాడికి దిగింది. 100 యుద్ధవిమానాలతో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌ సరిహద్దుల్లో 5 కిలోమీటర్ల మేర తమదేశం దిశగా హెజ్బొల్లా మోహరించిన రాకెట్‌ లాంచర్లే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపింది.


ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు హెజ్బొల్లా తమ దేశంపై దాడులు చేయడానికి సిద్ధమైన విషయం తెలియడంతో.. ఆ సమయానికి అరగంట ముందే ఇజ్రాయెల్‌ తన దాడులు మొదలుపెట్టడం గమనార్హం. అటు నుంచి హెజ్బొల్లా కూడా.. పెద్ద సంఖ్యలో డ్రోన్లు, 320కి పైగా కత్యూష రాకెట్లతో 11 ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలు, బ్యారక్‌లు, ఐరన్‌ డోమ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ప్రకటించింది. అయితే, ఈ దాడుల్లో లెబనాన్‌వైపు ముగ్గురు చనిపోగా.. ఇజ్రాయెల్‌ వైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని సమాచారం. ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ.. ఇటీవలికాలంలో ఇజ్రాయెల్‌పై ఈ స్థాయి దాడి జరగడం ఇదే. కాగా.. తమ దేశ పౌరుల ప్రాణాలకు ఏర్పడ్డ ముప్పును తప్పించేందుకే తాము లెబనాన్‌లో దాడులు జరిపామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గాలంట్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


ఇక, ఉత్తర ఇజ్రాయెల్‌ దిశగా హెజ్బొల్లా గురి పెట్టిన వేలాది రాకెట్లను తమ సైన్యం నిర్వీర్యం చేసిందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు క్యాబినెట్‌ మీటింగ్‌లో చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హెజ్బొల్లా దాడిపై సమాచారం నేపథ్యంలో ఆదివారం ఉదయాన్నే ఉత్తర ఇజ్రాయెల్‌లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు యుద్ధ సైరన్లు మోగించారు. ప్రజలంతా బాంబు షెల్టర్లకు దగ్గర్లో ఉండాలని ఇజ్రాయెల్‌ ‘హోం ఫ్రంట్‌ కమాండ్‌’ సూచించింది. ఆదివారం నాటి దాడులు కేవలం దక్షిణ లెబనాన్‌లో సరిహద్దులకు 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే చేశామని.. తమకు ముప్పు ఉందనుకుంటే లెబనాన్‌లో ఎక్కడైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించగా.. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తామని అమెరికా అధికారులు వెల్లడించారు.


కాగా.. తమ ప్రతీకారచర్యలకు ఇది ఆరంభం మాత్రమేనని హెజ్బొల్లా వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో.. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే.. ‘‘ఇజ్రాయెల్‌ పూర్తిస్థాయి యుద్ధాన్ని కోరుకోదు. కానీ, క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది’’ అని ఇజ్రాయెల్‌ విదేశాంగమంత్రి కాట్జ్‌ పేర్కొన్నట్టు రాయ్‌టర్స్‌ వార్తాసంస్థ ఒక కథనంలో తెలిపింది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌ హమాస్‌ మధ్య సంధి చేసి.. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు ఈజిప్టులో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ చర్చల్లో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్‌ విలియమ్‌ బర్న్స్‌, ఖతార్‌ ప్రధాని మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ తాహ్ని, ఈజిప్ట్‌ ప్రధాన నిఘా అధికారి అబ్బాస్‌ కమెల్‌ తదితరులు పాల్గొంటున్నారు. హమాస్‌ కూడా ప్రతినిఽధిని పంపింది.


  • రాకెట్లు పాత మోడల్‌వేగానీ..

ఇజ్రాయెల్‌పై ఆదివారంనాటి దాడికి హెజ్బొల్లా ప్రధానంగా ఉపయోగించింది.. కత్యూష రాకెట్లు! ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా అభివృద్ధి చేసిన అన్‌ గైడెడ్‌ రాకెట్లివి. ఆ తర్వాత రష్యా మరింత అధునాతన రాకెట్లను అభివృద్ధి చేసుకుందిగానీ.. హెజ్బొల్లా లాంటి సంస్థలు ఇప్పటికీ వాటిని వాడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే హెజ్బొల్లా అమ్ములపొదిలో ప్రస్తుతానికి ఇవే ప్రధాన ఆయుధాలు!! వారు వాడే రాకెట్లు 20 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.


అన్‌ గైడెడ్‌ కావడం ఒక లోపమే అయినప్పటికీ.. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించగల సామర్థ్యం వీటి సొంతం. 2006లో జరిగిన లెబనాన్‌వార్‌ సమయంలో కూడా ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా వేలాది కత్యూష రాకెట్లను ప్రయోగించింది. వీటితోపాటు.. షార్ట్‌ రేంజ్‌ రాకెట్లయిన ఫజ్ర్‌-1, ఫజ్ర్‌ 3, మీడియం రేంజ్‌ రాకెట్లయిన ఫజ్ర్‌ 5, ఎం-600, ఇరానియన్‌ జెల్‌జల్‌, ఫతే-110 వంటి మిస్సైళ్లు, యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లు, స్థానికంగా తయారుచేసిన ఆయూబ్‌, మిర్సాద్‌ డ్రోన్ల వంటివి హెజ్బొల్లా వద్ద ఉన్నాయి.

Updated Date - Aug 26 , 2024 | 05:10 AM