Share News

Israel's Chief Benjamin Netanyahu: లక్ష్యాలన్నీ సాధించాం

ABN , Publish Date - Oct 28 , 2024 | 03:21 AM

ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇలాం, కుజెస్థాన్‌లో ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్‌ తయారీ, ప్రయోగ కేంద్రాలపై శనివారం తెల్లవారుజామున చేసిన దాడిలో లక్ష్యాలన్నీ పూర్తి చేశామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు.

Israel's Chief Benjamin Netanyahu:  లక్ష్యాలన్నీ సాధించాం

  • ఇరాన్‌పై దాడి గురించి నెతన్యాహు ప్రకటన

  • మన సత్తా ఇజ్రాయెల్‌కు చూపాలి.. ఖమేనీ

  • దాడులను తక్కువ చేసి చూడొద్దు

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ వ్యాఖ్యలు

  • గాజాపై విరుచుకపడ్డ ఇజ్రాయెల్‌..

  • బాంబు దాడుల్లో 47 మంది మృతి

టెల్‌ అవీవ్‌, బీరుట్‌, గాజా, టెహ్రాన్‌: ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇలాం, కుజెస్థాన్‌లో ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్‌ తయారీ, ప్రయోగ కేంద్రాలపై శనివారం తెల్లవారుజామున చేసిన దాడిలో లక్ష్యాలన్నీ పూర్తి చేశామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. దాడిలో ఇరాన్‌ క్షిపణి తయారీకి ఉపయోగించే ఘన ఇంధన మిశ్రమం ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఈ కారణంగా ఇరాన్‌ క్షిపణి కార్యక్రమం కోలుకోవడానికి కనీసం ఏడాది కాలం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇరాన్‌ ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దెబ్బతీసినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. 2023 అక్టోబరు ఏడున హమాస్‌ దాడిలో మరణించినవారి సంస్మరణార్థం నిర్వహించిన కార్యక్రమంలో నెతన్యాహు ప్రసంగిస్తుండగా బందీల బంధువులు కొందరు అడ్డుకున్నారు.

సిగ్గుపడు అంటూ నినాదాలు చేశారు. దీంతో నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించిన కాసేపటికే ముగించాల్సి వచ్చింది. మరోవైపు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన ప్రతిదాడిపై సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్‌ సత్తా ఏంటో ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. అయితే ఎలా స్పందించాలనేదానిపై ఇరాన్‌ అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు. ఇజ్రాయెల్‌ దాడులను తక్కువ చేసి చూడొద్దని, అలాగని అతిగా కూడా ఊహించుకోవద్దన్నారు. ఇజ్రాయెల్‌ జరిపిన దాడిని తాము తిప్పికొట్టామని, అందువల్లే నష్టం పరిమిత స్థాయిలో జరిగిందని ఇరాన్‌ ప్రకటించింది. నలుగురు సైనికులు మరణించారని వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై సరైన సమయంలో దాడి చేస్తామనీ హెచ్చరించింది.


  • గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు

గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. బేట్‌ లహియాలో ఆరు భవనాలపై కురిపించిన బాంబుల వర్షంలో 47 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. కాగా, ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ సమీపంలోని ఓ బస్టా్‌పలోకి ట్రక్కు దూసుకుపోయిన ఘటనలో ఒకరు చనిపోయారు. 35 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇజ్రాయెల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ మొసాద్‌ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన జరగడం, ట్రక్కు నడిపిన వ్యక్తి అరబ్‌ ఇజ్రాయెలీ కావడంతో ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. నిందితుడిని కాల్చి చంపారు. మరోవైపు.. హెజ్బొల్లా సంస్థ లాటిన్‌ అమెరికా దేశాల ఆపరేషనల్‌ చీఫ్‌.. హుస్సేన్‌ అహ్మద్‌ కరాకీ ఆచూకీని గుర్తించామని అర్జెంటినా రక్షణ మంత్రి ప్యాట్రికా బలారిచ్‌ ప్రకటించారు.

Updated Date - Oct 28 , 2024 | 03:21 AM