Share News

North Korea: నియంతృత్వానికి పరాకాష్ట.. వరదలను అడ్డుకోలేదని 30 మందికి ఉరి

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:24 AM

ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వరదలను అడ్డుకోలేదనే కారణంతో ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణ శిక్ష విధించారు.

North Korea: నియంతృత్వానికి పరాకాష్ట.. వరదలను అడ్డుకోలేదని 30 మందికి ఉరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వరదలను అడ్డుకోలేదనే కారణంతో ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణ శిక్ష విధించారు. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. ఉత్తరకొరియా ప్రజలపై ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించిన కిమ్.. నియంతృత్వానికి పరాకాష్టగా ప్రభుత్వ అధికారులకు మరణ శిక్ష వేశారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ఉత్తర కొరియాలోనూ భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కిమ్.. కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 20-30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణకొరియా మీడియా ఓ కథనంలో ప్రచురించగా.. ఆ తరువాత కొద్ది రోజులకు వారందరికీ మరణశిక్ష అమలు చేశారని కథనంలో పేర్కొంది. అయితే సదరు అధికారుల వివరాలు, శిక్ష, అమలు తదితర విషయాలు బయటకు రాలేదు. మరణ శిక్షకు గురైన వారిలో చాగాంగ్‌ ప్రావిన్స్‌ ప్రొవిన్షియల్‌ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్‌ బాంగ్ హూన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విపత్తు సమయంలో అధ్యక్షుడు కిమ్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించగా.. బాంగ్ హూన్‌ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు సైతం మరణ శిక్ష పడి ఉండవచ్చని దక్షిణ కొరియా మీడియా కోడై కూస్తోంది.


4 వేల మందికిపైగా బలి

ఉత్తరకొరియాలో జులై-ఆగస్టు మధ్యకాలంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయితే ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు కిమ్ విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మోకాలి లోతు నీటిలో కార్ నడుపుతూ.. బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒకానొక సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రభుత్వ అధికారులు ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే కోపంతోనే వారందరికి ఉరి శిక్ష వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభుత్వోద్యోగులకు మరణశిక్ష విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య కిమ్ నియంత ధోరణికి అద్దం పడుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. దక్షిణ కొరియా మీడియా కథనాలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు.

For Latest News click here

Updated Date - Sep 04 , 2024 | 11:25 AM