Share News

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. యుద్ధ ప్రారంభం తరువాత తొలిసారి

ABN , Publish Date - Jul 27 , 2024 | 10:03 AM

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్‌కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. యుద్ధ ప్రారంభం తరువాత తొలిసారి

ఢిల్లీ: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్‌కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.

ఇటలీలో జరిగిన G7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సమావేశమైన ఒక నెల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ సమావేశంలో మోదీ, జెలెన్ స్కీ ఆప్యాయంగా పలకరించుకుని.. యుద్ధ పరిణామాలపై చర్చించుకున్నారు.


లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మూడోసారి అధికారపగ్గాలు చేపట్టడంపై జెలెన్ స్కీ ఆయన్ని అభినందించారు. యుద్ధంతో దెబ్బతిన్న తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా మోదీని కోరారు. ఈ ఏడాది మార్చిలో జెలెన్స్కీతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ భారత్-ఉక్రెయిన్ బంధాన్ని బలోపేతం చేయడానికి గల మార్గాలపై చర్చించారు.

రష్యా - ఉక్రెయిన్ చర్చలతో యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. శాంతియుత చర్చలు జరపడంలో మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ముందుంటుందని ప్రధాని అన్నారు.


ఇటీవలే రష్యా పర్యటన..

మోదీ ఇటీవలే రష్యాలో పర్యటించారు. రష్యాలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అసాధారణమైన సేవలకుగానూ పుతిన్‌ చేతులమీదుగా రష్యా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను కూడా మోదీ అందుకున్నారు. 22వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానం మేరకు జులై 8, 2024 నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కోను సందర్శించారు.


రష్యా పర్యటన అనంతరం నెలరోజుల వ్యవధిలో మోదీ ఉక్రెయిన్‌కు వెళుతుండటం ఆసక్తిగా మారింది. ఆగస్ట్‌ 24న ఉక్రెయిన్‌ స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మోదీ ఉక్రెయిన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ పర్యటన చర్చల దశలో ఉంది. ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సమస్యల్ని పరిష్కరించగలమని భారత్ మొదటి నుంచి చెబుతోంది. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ చాలాసార్లు చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jul 27 , 2024 | 10:24 AM