Share News

PM Modi : సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:22 AM

సమస్యలకు యుద్ధ భూమిలో పరిష్కారం లభించదని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియా సంక్షోభాలు యావత్‌ ప్రపంచానికి చేటు అని పేర్కొన్నారు.

 PM Modi : సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు

  • ఉక్రెయిన్‌, పశ్చిమాసియా సంక్షోభాలు ప్రపంచానికి చేటు.. చర్చలతో శాంతి పునరుద్ధరణకు మా మద్దతు

  • సవాళ్లకు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలే సమాధానం

  • పోలండ్‌తో సామాజిక భద్రతా ఒప్పందం: ప్రధాని మోదీ

  • నేడు ఉక్రెయిన్‌ పర్యటనకు.. తొలి భారత ప్రధానిగా రికార్డు

వార్సా, కీవ్‌, ఆగస్టు 22: సమస్యలకు యుద్ధ భూమిలో పరిష్కారం లభించదని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియా సంక్షోభాలు యావత్‌ ప్రపంచానికి చేటు అని పేర్కొన్నారు. చర్చలతో శాంతి పునరుద్ధరణకు భారత్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పోలండ్‌ పర్యటనలో భాగంగా గురువారం మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయ్యారు.

ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం సహా పలు అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. పోలండ్‌తో సామాజిక భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. తద్వారా శుద్ధ ఇంధనం, కొత్త టెక్నాలజీ రంగాల్లో బంధం బలోపేతం అవుతుందని తెలిపారు. టస్క్‌తో చర్చల అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. సంక్షోభాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మానవత్వానికే సవాల్‌గా మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత త్వరగా శాంతి స్థిరత్వం స్థాపనకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

ఈ దిశగా మిత్ర దేశాలతో కలిసి వీలైనంత సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కాగా, బుధవారం రాత్రి పోలండ్‌ రాజధాని వార్సా చేరుకున్న మోదీ.. 45 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు. చివరగా 1978లో మొరార్జీ దేశాయ్‌ పోలండ్‌ వెళ్లారు.


ఇదే విషయాన్ని ప్రస్తావించిన మోదీ ఇరు దేశాల సంబంధాల్లో ప్రత్యేక సందర్భమని పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ సవాళ్లకు ఐక్యరాజ్య సమితి విస్తరణే పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సహా భారత్‌-పోలండ్‌ ప్రతి అంతర్జాతీయ వేదికపై పరస్పరం సహకరించుకుంటున్న సంగతిని గుర్తుచేశారు.

ప్రపంచ సంస్థలు ప్రతిదాంట్లోనూ సంస్కరణ అవసరమని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన రోజుల్లో పోలండ్‌ మీదుగా భారత విద్యార్థుల తరలింపునకు అనుమతి ఇచ్చినందుకు టస్క్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

కాగా, మోదీ ప్రత్యేక రైలులో పది గంటలు ప్రయాణించి శుక్రవారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్లనున్నారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌ ఏర్పడ్డాక ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీనే. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆయన సమావేశమవుతారు.

Updated Date - Aug 23 , 2024 | 03:22 AM