Share News

Mohammed bin Salman: నన్ను చంపేస్తారని భయమేస్తోంది... అమెరికా ముందు వాపోయిన సౌదీ రాజు

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:29 PM

"నన్ను ప్రత్యర్థులు ఏ క్షణమైన చంపేస్తారని భయమేస్తోంది" ఇది అక్షరాల ఓ దేశానికి చెందిన యువరాజు వ్యాఖ్యలు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా చట్ట సభ సభ్యులతో ఇలా గోడు వెల్లబోసుకున్నారు.

Mohammed bin Salman: నన్ను చంపేస్తారని భయమేస్తోంది... అమెరికా ముందు వాపోయిన సౌదీ రాజు

ఇజ్రాయెల్: "నన్ను ప్రత్యర్థులు ఏ క్షణమైన చంపేస్తారని భయమేస్తోంది" ఇది అక్షరాల ఓ దేశానికి చెందిన యువరాజు వ్యాఖ్యలు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్(Mohammed bin Salman) అమెరికా చట్ట సభ సభ్యులతో ఇలా గోడు వెల్లబోసుకున్నారు. తన వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేస్తారేమోనని భయపడుతున్నట్లు చెప్పారు. యువరాజు ఆందోళన నేపథ్యంలో సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికన్ వెబ్‌సైట్ ‘పొలిటికో’ నివేదించింది.

వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదికి తెస్తుందని అమెరికా చట్టసభ్యుల వద్ద మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారట. సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే ఒప్పందం చేసుకోవడం ద్వారా తన ప్రాణాలను పణంగా పెట్టారని ఆక్షేపించారు. పాలస్తీనాలో ఆందోళనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరిస్తే తనను హత్య చేస్తారన్నారు. అయితే ఇజ్రాయెల్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందులో భాగంగానే అమెరికా సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం, పౌర అణు కార్యక్రమం, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటివి జరిగాయి.


అన్వర్ సాదత్‌ ఘటనను ఉదహరిస్తూ..

ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని హత్యకు గురైన ఈజిప్టు నేత అన్వర్ సాదత్‌ పేరును ఆయన యూఎస్ ప్రతినిధులముందు ప్రస్తావించారు. తన భద్రతపట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అన్వర్ సాదత్‌ను కాపాడేందుకు అమెరికా తీసుకున్న చర్యలపై ఆరా తీసినట్లు సమాచారం. శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయడంలో తాను ఎదుర్కొనే బెదిరింపులు, గాజాలో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాల్లో తనపై కోపాన్ని చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా అమెరికా ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది.


తాజాగా తూర్పు గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 100 మందికి పైగా మరణించారు. గాజాలో 10 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 40 వేలకుపైగా పౌరులు మరణించారు. ఈ అంశంపై సౌదీ అరేబియాలోనూ వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు ఇస్లాం మత ప్రదేశాల స్థలాల సంరక్షకుడిగా ఉన్న తనకు, స్వదేశంలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నట్లు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యువరాజే తనకు ప్రాణ భయం ఉందనడం సౌదీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - Aug 16 , 2024 | 05:35 PM