Share News

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

ABN , Publish Date - Nov 10 , 2024 | 03:14 AM

వైద్య కళాశాలలో సీటు పొందాలన్న లక్ష్యంతో ‘నీట్‌’ ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం కాన్పూర్‌ వచ్చిన ఓ బాలిక పలుమార్లు అత్యాచారానికి గురయింది. పేరుపొందిన ఇద్దరు కోచింగ్‌ టీచర్లే ఈ దారుణానికి పాల్పడ్డారు.

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

  • బ్లాక్‌మెయిల్‌ చేసి పలుమార్లు రేప్‌.. ఇద్దరు కోచింగ్‌ టీచర్ల అరెస్టు

కాన్పూర్‌, నవంబరు 9: వైద్య కళాశాలలో సీటు పొందాలన్న లక్ష్యంతో ‘నీట్‌’ ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం కాన్పూర్‌ వచ్చిన ఓ బాలిక పలుమార్లు అత్యాచారానికి గురయింది. పేరుపొందిన ఇద్దరు కోచింగ్‌ టీచర్లే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇంతకాలం భయంతో నోరు విప్పని ఆ బాలిక ఎట్టకేలకు ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ఓ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో బయాలజీ టీచర్‌ సహీల్‌ సిద్దిఖీ (32) విద్యార్థులందరికీ పార్టీ ఇస్తున్నానని చెప్పి ఆ బాలికను (ఆ సమయంలో ఆమె మైనర్‌) తన ఇంటికి పిలిచాడు.

వెళ్లి చూసే సరికి ఇతర విద్యార్థులు ఎవరూ లేరు. ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులకు హాని కలిగిస్తానని బెదిరించాడు. అనంతరం పార్టీల పేరుతో పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇదే క్రమంలో కెమిస్ట్రీ బోధించే వికాస్‌ పోర్వాల్‌ (39) కూడా ఆమెను రేప్‌ చేశాడు. హోలీ పండగకు ఇంటికి వెళ్లగా వెంటనే రావాలని పిలిపించి అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. సిద్దిఖీపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలతోనే కేసు నమోదయింది. కొద్ది నెలల క్రితం మరో బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అరెస్టయి, ఇటీవలే బెయిల్‌పై వచ్చాడు. బాధితురాలు ఆ ఇద్దరు టీచర్లపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 03:14 AM