Delhi: 100 వందేభారత్, 772 ఇతర రైల్వే సర్వీసులు తెచ్చాం.. రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ ప్రకటన
ABN , Publish Date - Aug 02 , 2024 | 08:43 PM
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
ఢిల్లీ: భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. 2024-25లో నడపడానికి ప్రతిపాదించిన కొత్త రైళ్ల సంఖ్యను తెలియజేయాలని బీజేపీ ఎంపీ నీరజ్ శేఖర్ రైల్వే మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో వందే భారత్, రాజధాని సహా పలు రైళ్లను ప్రవేశపెట్టామన్నారు.
"వివిధ వర్గాల ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి, భారతీయ రైల్వే ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, ప్యాసింజర్/మెము/డెము రైళ్లు, సబర్బన్ సర్వీసులను ప్రవేశపెట్టింది. 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో, భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 100 వందే భారత్ సేవలతో సహా 772 రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త రైల్వే లైన్లు నిర్మించడం, నూతన రైళ్లను ప్రవేశపెట్టడం నిరంతరం ప్రక్రియ" అని మంత్రి సభలో వెల్లడించారు.
నమోనగర్ పేరుతో కొత్త సిటీలు..
దేశంలోని ప్రతి రాష్ట్రంలో నమో నగర్ పేరుతో హైటెక్ సిటీలు ఏర్పాటు చేయాలని బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ రాజ్యసభలో స్పష్టం చేశారు. వీటితో పట్టణీకరణ వేగం పుంజుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై శుక్రవారం రాజ్యసభలో చర్చించేందుకు ప్రైవేట్ బిల్లును ఆయన ప్రతిపాదించారు.
ఇటీవల కొన్ని దశాబ్దాలుగా దేశంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే కాకుండా.. పట్టణాల నుంచి నగరాలకు వలసలు బారీగా పెరిగాయని పేర్కొన్నారు. పట్టాణాభివృద్ధిని బలోపేతం చేసేందుకు.. సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీల పేరిట అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా ఎంపీ భీమ్ సింగ్ సభలో ప్రస్తావించారు.
For Latest News and National News Click Here