Share News

కలిసొచ్చే కాలానికి.. అందొచ్చిన కొడుకులు!

ABN , Publish Date - Oct 15 , 2024 | 06:13 AM

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకని సామెత! అపర కుబేరుడు ధీరూభాయ్‌ అంబానీ రెండో కుమారుడు.. అనిల్‌ అంబానీకి ఒకరు కాదు.. ఇద్దరు కొడుకులు.. జై అన్‌మోల్‌, జై అన్షుల్‌ అచ్చం అలాగే అవసరానికి కలిసొచ్చారు. నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన

కలిసొచ్చే కాలానికి.. అందొచ్చిన కొడుకులు!

నష్టాల ఊబి నుంచి లాభాల్లోకి వ్యాపారాలు

తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టిన

అనిల్‌ అంబానీ కుమారులు అన్‌మోల్‌, అన్షుల్‌


కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకని సామెత! అపర కుబేరుడు ధీరూభాయ్‌ అంబానీ రెండో కుమారుడు.. అనిల్‌ అంబానీకి ఒకరు కాదు.. ఇద్దరు కొడుకులు.. జై అన్‌మోల్‌, జై అన్షుల్‌ అచ్చం అలాగే అవసరానికి కలిసొచ్చారు. నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్‌ పవర్‌ను రూ.20,526 కోట్ల కంపెనీగా నిలబెట్టారు. కన్న తండ్రిని సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. ఆస్తుల పంపకం అనంతరం అన్న ముకేశ్‌ అందనంత ఎత్తుకు ఎదిగిపోతే.. నష్టాలపాలై, దివాలా తీసిన అనిల్‌ అంబానీ.. ఇప్పుడు పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు. తండ్రి నుంచి తన వాటాగా వచ్చిన రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కొడుకులు తమ సామర్థ్యంతో మళ్లీ నిలబెట్టడంతో మురిసిపోతున్నారు.


ANIL-FAMILY.jpg


పెరిగిన షేర్ల విలువ

ఇటీవలే ఆయన రిలయన్స్‌ పవర్‌ షేర్లు 5 శాతం మేర పెరిగి.. 52 వారాల గరిష్ఠానికి చేరాయి. రిలయన్స్‌ పవర్‌ డెట్‌-ఫ్రీ కంపెనీగా మారగా.. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా అప్పులు 87 శాతం తగ్గిపోయాయి. రిలయన్స్‌ పవర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,052.67 కోట్లు దాటింది. మరీ ముఖ్యంగా రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌కు కొత్త శక్తిని నింపడంలో జై అన్‌మోల్‌ కీలకపాత్ర పోషించారు. ఈ ఉత్సాహంతో అనిల్‌ అంబానీ.. భూటాన్‌లో పలు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు చేపట్టారు. డ్రక్‌ హోల్డింగ్‌ సంస్థతో కలిసి అనిల్‌ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ 1270 మెగావాట్ల సోలార్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులను ప్రకటించింది. ఇంధన రంగంలో తన వ్యాపారాన్ని, పెట్టుబడులను విస్తరించడానికి రిలయన్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఒక కొత్త సంస్థనే ప్రారంభించారు. కాగా.. అన్నదమ్ములిద్దరిలో అన్‌మోల్‌ అంబానీ 2014లో రిలయన్స్‌ మ్యూచువల్‌ఫండ్‌ పగ్గాలు చేపట్టారు.


ANIL-FAMILY-2.jpg


కుమారుల వల్లే..

2017 నాటికి రిలయన్స్‌ క్యాపిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయ్యారు. అన్‌మోల్‌ నేతృత్వంలో.. రిలయన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సంస్థలు లాభాలబాట పట్టాయి. ఫలితంగా అతడి నికర విలువ రూ.20 వేల కోట్లు దాటింది. ఇతడికి ముంబైలో రూ.5 వేల కోట్ల విలువ చేసే 17 అంతస్తుల టవర్‌ (దాని పేరు ‘ఎబోడ్‌’) ఉంది. రోల్స్‌రాయ్‌స్‌, లాంబోర్ఘిని తదితర హైఎండ్‌ కార్ల కలెక్షన్‌, సొంత విమానం కూడా ఉన్నాయి. ఇక.. న్యూయార్క్‌ వర్సిటీలోని ప్రఖ్యాత స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి బాచిలర్స్‌ డిగ్రీ పుచుకున్న అనిల్‌ చిన్న కుమారుడు అన్షుల్‌ కూడా వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నారు. అయితే, దానికన్నా అతడి విలాసవంతమైన జీవనశైలే ఎక్కువగా ప్రచారంలో ఉంది. అన్షుల్‌ కార్ల కలెక్షన్‌లో.. మెర్సిడెస్‌ జీఎల్‌కే 350, లాంబోర్ఘిని గల్లార్డో, రోల్స్‌ రాయ్‌స్‌ ఫాంటమ్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌ తదితరాలున్నాయి. బొంబార్డియర్‌ గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్స్‌ఆర్‌ఎస్‌, ఫాల్కన్‌ 2000, ఫాల్కన్‌ 7ఎక్స్‌ విమానాలు, బెల్‌ 412 హెలికాప్టర్‌ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Oct 15 , 2024 | 01:49 PM