Bridge Collapse: బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 16 రోజుల్లో ఇది 10వ సంఘటన
ABN , Publish Date - Jul 04 , 2024 | 03:12 PM
బిహార్‌లో వంతెనలు కూలిపోయే పర్వం కొనసాగుతూనే ఉంది. అవి పేకమేడలా ఒకదాని తర్వాత మరొకటి కూలిపోతున్నాయి. గత 24 గంటల్లోనే సరన్ ప్రాంతంలో రెండు వంతెనలు కూలగా..
బిహార్‌లో (Bihar) వంతెనలు కూలిపోయే (Bridge Collapse) పర్వం కొనసాగుతూనే ఉంది. అవి పేకమేడలా ఒకదాని తర్వాత మరొకటి కూలిపోతున్నాయి. గత 24 గంటల్లోనే సరన్ ప్రాంతంలో రెండు వంతెనలు కూలగా.. తాజాగా జులై 24న అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. 16 రోజుల్లో ఇది 10వ సంఘటన. ఈ వంతెనను 15 ఏళ్ల క్రితం నిర్మించారని.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా మెజిస్ట్రేట్ (DM) అమన్ సమీర్ (Aman Sameer) క్లారిటీ ఇచ్చారు. గండకి నదిపై నిర్మించిన ఈ వంతెన సరన్‌లోని కొన్ని గ్రామాలను సివాన్ జిల్లాతో కలుపుతుంది.
‘‘సరన్ ప్రాంతంలో గురువారం (జులై 4న) కూలిన చిన్న వంతెనను 15 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ వంతెన కూలిపోవడానికి కచ్ఛితమైన కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. అయితే.. ఇటీవల అక్కడ డీసిల్టింగ్ పని జరిగింది. ఈ వంతెన కూలడానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టాం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని అమన్ సమీర్ మీడియాకు తెలిపారు. ఈమధ్య కాలంలో జిల్లాలో చిన్న వంతెనలు వరుసగా కూలిపోతున్నాయని.. అందుకు గల కారణాల్ని తెలుసుకునేందుకు ఉన్నస్థాయి విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలావుండగా.. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోందని, దాని వల్లే ఈ వంతెన కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు.
కాగా.. గత 16 రోజుల్లో సివాన్, సరన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో కలుపుకొని మొత్తం 10 వంతెనలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలోనే.. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం నితీశ్ కుమార్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పాత వంతెనలపై సర్వే నిర్వహించాలని.. తక్షణ మరమ్మత్తులు అవసరమయ్యే వాటిని గుర్తించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు నిర్మాణ శాఖ ఇప్పటికే వంతెన నిర్వహణ విధానాన్ని సిద్ధం చేసిందని, గ్రామీణ పనుల శాఖ తక్షణమే తన ప్రణాళికను రూపొందించాలని ఆయన చెప్పారు.
Read Latest National News and Telugu News