Share News

West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు

ABN , Publish Date - Jul 02 , 2024 | 01:49 PM

పశ్చిమబెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై అధికార టీఎంసీ నేత తాజ్‌ముల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే ఈ దాడి వీడియో కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది.

West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు

కోల్‌కతా, జులై 02: పశ్చిమబెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై అధికార టీఎంసీ నేత తాజ్‌ముల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే ఈ దాడి వీడియో కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది. ఈ వీడియోను తన అనుమతి లేకుండా తీశారంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వీడియో ఎవరు తీశారో కూడా తనకు తెలియదని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.

మరోవైపు ఈ జంటపై విచక్షణరహితంగా దాడి చేసిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు తాజ్‌ముల్‌ అలియాస్ జేసీబీని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అతడికి 5 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. ఇంకోవైపు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత ముజుందార్ కాస్తా ఘాటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో తాలిబన్ పాలన నడుస్తుందని.. షరియా చట్టం అమలవుతుందని మండిపడ్డారు.


రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేవన్నారు. ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుచ్ బిహార్ నుంచి చోప్రా వరకు ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఆయా ఘటనల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇదంతా ఎమ్మెల్యే హమిదుల్ రెహామాన్ ఆదేశాల మేరకే జరిగిందని కేంద్ర మంత్రి సుకాంత ముజుందార్ ఆరోపించారు.

ఇక ఈ ఘటనపై బెంగాల్ గవర్నర్ సీ వీ ఆనంద్ బోస్ సోమవారం స్పందించారు. ఇది అనాగరికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సంఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే గవర్నర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన మంగళవారం కోల్‌కతా చేరుకొనున్నారు. ఆ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆయన పరామర్శించనున్నారని సమాచారం. అలాగే ఈ ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వం అందజేసే నివేదికను గవర్నర్.. కేంద్రానికి నివేదించనున్నారని రాజభవన్ వర్గాలు పేర్కొన్నాయి.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 06:10 PM