BSP: కత్తులతో వేటాడి.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య
ABN , Publish Date - Jul 06 , 2024 | 08:53 AM
తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షుడిని నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్(Armstrong) చెన్నై పెరంబూర్‌లో నివసిస్తున్నాడు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కత్తులతో నరికి హత్య చేశారు.
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నడి రోడ్డుపై అతి కిరాతకంగా దుండగులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్(Armstrong) చెన్నై పెరంబూర్‌లో నివసిస్తున్నాడు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కత్తులతో నరికి హత్య చేశారు. ఇంటి ముందు నిలబడ్డ ఆయన్ని కిరాతకంగా నరికి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు గుర్తించి దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతిచెందారు. ఆయన పక్కన ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సెంబియ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను తనిఖీ చేస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కేసులు ఉన్నాయని.. కొన్ని ముఠాలతో పాత కక్షలు ఉన్నట్లు గుర్తించారు. 2023లో గ్యాంగ్‌స్టర్ అర్కట్ సురేశ్‌ని హత్య చేశారని.. అతని సన్నిహితులే ఆర్మ్‌స్ట్రాంగ్‌ని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ ప్రారంభించామని, ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 10 పోలీసు బృందాలు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చినట్లు తెలిపారు.
మండిపడిన విపక్షాలు..
డీఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి విమర్శించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు హత్యకు గురి కావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థులకు రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని.. పోలీసులు, చట్టం అంటే భయం లేకుండా పోయిందని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడి హత్యపై బీఎస్పీ అధినేత మాయావతి ఎక్స్‌లో స్పందించారు.
‘‘తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేయడం దారుణం. ఆయన ఓ న్యాయవాది. రాష్ట్రంలో బలమైన దళిత నేతగా పేరుపొందారు. నిందితులను పట్టుకుని శిక్షించాలి’’ అని మాయావతి సీఎం స్టాలిన్‌ను కోరారు. ఆర్మ్‌స్ట్రాంగ్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి లాయర్‌గా స్థిరపడ్డారు. చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్‌కు 2006లో ఎన్నికైన ఆయన... 2022లో నిర్వహించిన ఓ ర్యాలీతో అందరి దృష్టిని ఆకర్షించారు. వెంటనే బీఎస్పీలోకి చేరడం.. పార్టీ అధ్యక్షుడిగా మారడం చకచక జరిగిపోయాయి.
For Latest News and National News click here