Share News

Central Govt : వచ్చే ఏడాది జనగణన

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:01 AM

చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న జనగణన ప్రక్రియను కేంద్రం వచ్చే ఏడాది మొదట్లోనే చేపట్టి.. 2026కల్లా జాతీయ జనాభా పట్టికను నవీకరించి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Central Govt : వచ్చే ఏడాది జనగణన

  • 2025 మొదట్లో షురూ.. 2026లో పూర్తి.. ఆ తర్వాత లోక్‌సభ సీట్ల పునర్విభజన

  • రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ పదవీకాలం ఆగస్టు దాకా పొడిగింపు

  • అఖిలపక్ష భేటీ నిర్వహణకు కాంగ్రెస్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 28: చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న జనగణన ప్రక్రియను కేంద్రం వచ్చే ఏడాది మొదట్లోనే చేపట్టి.. 2026కల్లా జాతీయ జనాభా పట్టికను నవీకరించి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న కుల గణన విషయంపై మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో జనగణన చక్రం 2035, 2045.. అలా మారుతుందని ఆ వర్గాలు వివరించాయి. వచ్చే ఏడాది చేపట్టే జనగణన పూర్తయ్యాక.. 2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. కాగా.. 1951 నుంచి ప్రతి పదేళ్లకొకసారి మనదేశంలో జనగణన జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2021లో కరోనా కారణంగా జరగలేదు. అప్పట్నుంచీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు ఈసారి కులగణన కూడా చేపట్టాలని, దానివల్ల దేశంలో ఓబీసీ జనాభా ఎంతో తెలుస్తుందని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • స్పష్టత ఇవ్వండి..

జనగణనకు సంబంధించిన కసరత్తు మొదలైందన్న వార్తలతోపాటు.. రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియాగా వ్యవహరిస్తున్న మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ పదవీకాలాన్ని 2026 ఆగస్టు దాకా పొడిగించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. జనాభా లెక్కలను సేకరించే ప్రక్రియలో భాగంగా కులగణన చేపడతారా? లేదా? వివిధ రాష్ట్రాల లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించడానికి ఈ సెన్సస్‌ వివరాలను ఉపయోగించుకుంటారా? అనే రెండు కీలక అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఈ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరిపితే అది.. కుటుంబనియంత్రణను సమర్థంగా పాటించిన రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Oct 29 , 2024 | 03:01 AM