Jharkhand: చంపై సోరెన్ ఎక్స్ అకౌంట్ నుంచి జేఎంఎం ఔట్.. పార్టీ మార్పు ఖాయమే!?
ABN , Publish Date - Aug 18 , 2024 | 02:38 PM
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత చంపై సోరెన్ తన X ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించారు. దీంతో చంపై సోరెన్ బీజేపీలోకి వెళ్లబోతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత చంపై సోరెన్ తన X ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించారు. దీంతో చంపై సోరెన్ బీజేపీలోకి వెళ్లబోతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఏడాది నెలాఖరులో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ అధిష్టానంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని.. ఈ క్రమంలోనే బీజేపీవైపు అడుగులు వేస్తారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. అయితే తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని చంపై చెబుతున్నా.. ఆయన పార్టీ మారతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
భూకుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren) కటకటాలపాలయ్యారు. ఆ తరువాత చంపై సోరెన్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28న హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. జులై 4న మరోసారి సీఎంగా ప్రమాణం చేయడానికి సిద్ధం అయ్యారు.
ఈ క్రమంలో చంపై సీఎం పదవికి జులై 3న సీఎం రాజీనామా చేశారు. అయితే ముఖ్యమంత్రి పదవిని దీర్ఘకాలంపాటు ఆశించిన చంపై సోరెన్ అనూహ్య పరిస్థితుల్లో దిగిపోవడం ఆయనకు నచ్చలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
For Latest News and National News click here