Share News

Chennai: త్వరలో జయలలిత 28 కిలోల బంగారు నగల వేలం..

ABN , Publish Date - Feb 26 , 2024 | 10:33 AM

అక్రమార్జన కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా సొమ్ము రూ.100 కోట్ల వసూలు దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa)కు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది.

Chennai: త్వరలో జయలలిత 28 కిలోల బంగారు నగల వేలం..

చెన్నై: అక్రమార్జన కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా సొమ్ము రూ.100 కోట్ల వసూలు దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa)కు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఆ నగలను వేలం ద్వారా రూ.40 కోట్లకు విక్రయించనున్నారు. మిగతా రూ.60కోట్లను ఆమె స్థిరాస్థులను విక్రయించి వసూలు చేయనున్నారు. 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు అక్రమార్జన కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేక కోర్టు తీర్పును ఖరారు చేసింది. జయ మృతి చెంది ఆరేళ్లవుతున్నా జరిమానా సొమ్మును వసూలు చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో జయకు చెందిన విలువైన బంగారు ఆభరణాలను విక్రయించి, స్థిరాస్తులలో కొంత భాగాన్ని వసూలు చేసి రూ.100 కోట్ల జరిమానా సొమ్మును వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు జయ నివాసగృహం నుంచి స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి ఆభరణాలను కోర్టుకు సమర్పించారు. ఆ నగలను వేలం ద్వారా విక్రయించనున్నారు. బెంగళూరు కోర్టులో ఉన్న ఆ నగలను మార్చి 6 లేదా 7వ తేదీన చెన్నైకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఖజానాలో వాటిని ఉంచి వేలం ద్వారా విక్రయించనున్నారు. జరిమానా సొమ్ము రూ.100కోట్లతోపాటు బెంగళూరు కోర్టు విచారణ ఫీజుల రూపంలో రూ.5కోట్లను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ముకు కూడా జయ స్థిరాస్థులను విక్రయించి రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 10:33 AM