Share News

Lok Sabha: 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌కి ఆ అవకాశం..

ABN , Publish Date - Jun 16 , 2024 | 06:40 PM

గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండటంతో లోక్ సభలో ప్రతిపక్షాల బలం నామమాత్రంగానే ఉండింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్(Congress) 2014, 2019 ఎన్నికల్లో చతికిలపడి దిగువసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు దూరమైంది.

Lok Sabha: 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌కి ఆ అవకాశం..

ఢిల్లీ: గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండటంతో లోక్ సభలో ప్రతిపక్షాల బలం నామమాత్రంగానే ఉండింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్(Congress) 2014, 2019 ఎన్నికల్లో చతికిలపడి దిగువసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు దూరమైంది. ఈ మధ్యే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ 10 శాతం కంటే ఎక్కువగా లోక్ సభ సభ్యులను గెలిపించుకుంది. దీంతో 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండనున్నాడు. 2014 నుంచి ఈ పదవి ఖాళీగా ఉండగా, ఈసారి కాంగ్రెస్‌కు సరిపడా సీట్లు వచ్చాయి. గత పదేళ్లలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యులలో 10 శాతం కంటే తక్కువగా ఉండింది. ప్రతిపక్ష స్థానం ఖాళీ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా దేశంలో ఎనిమిది సార్లు ఇలాగే జరిగింది.

మొదటిసారి..

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో ప్రతిపక్షాలకు ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకునే అవకాశం రాలేదు. మొదటి, రెండు, మూడో లోక్‌సభలో ఈ పదవి ఖాళీగా ఉండేది. నాలుగో లోక్‌సభలో తొలిసారిగా రామ్‌ సుభాగ్‌ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఐదు, ఏడు, ఎనిమిదో లోక్‌సభలో కూడా ఈ పదవి ఖాళీగా ఉంది. 2014 -16వ లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2019లో జరిగిన 17వ లోక్‌సభలోనూ ప్రతిపక్షాలు ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోలేకపోయాయి. 18వ లోక్‌సభలో తొలిసారిగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతను నియమించే అవకాశం విపక్షాలకు దక్కింది. లోక్‌సభలో మొత్తం ఎనిమిది సార్లు ప్రతిపక్ష నాయకుడి పదవి ఖాళీగా ఉంది.


కాంగ్రెస్‌కు మంచి అవకాశం

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 240 సీట్లు గెలుచుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 292 లోక్‌సభ స్థానాలతో సంపూర్ణ మెజారిటీని పొందింది. కాంగ్రెస్ 99 స్థానాలను గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అయితే ఈసారి ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకునేంత సీట్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి.

  • ప్రతిపక్ష నాయకుడి పదవి కేబినెట్ మంత్రితో సమానంగా ఉంటుంది.

  • కేంద్ర మంత్రితో సమానంగా జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలను పొందుతారు.

  • వసతి, డ్రైవర్‌‌తో కూడిన కారును అందిస్తారు.

  • ప్రతిపక్ష నాయకుడికి కూడా సిబ్బంది ఉంటారు.

  • ప్రతిపక్ష నాయకుడు పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్‌టేకింగ్స్, ఎస్టిమేట్స్ వంటి ముఖ్యమైన కమిటీలలో సభ్యుడిగా ఉంటాడు.

  • అనేక జాయింట్ పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగానూ ఉంటాడు.

  • సీబీఐ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అధిపతులను నియమించే సెలక్షన్ కమిటీలలో ప్రతిపక్ష నాయకుడిని సభ్యుడిగా చేస్తారు.

  • పార్లమెంట్‌లో ప్రభుత్వ విధానాలను విమర్శించే స్వేచ్ఛ ప్రతిపక్ష నేతకు ఉంటుంది.

Updated Date - Jun 16 , 2024 | 06:40 PM