Delhi: ఢిల్లీలో గ్రేప్-3 అమలు.. ఏంటంటే
ABN , Publish Date - Nov 14 , 2024 | 09:00 PM
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారింది. గాలి నాణ్యత క్రమంగా తగ్గుముఖం పట్టింది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు వైద్యులు సూచించారు.
ఢిల్లీ: చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతుంటుంది. వాహనాల కాలుష్యం, పొరుగున ఉన్న హర్యానాలో వరి కుప్పలు తగులబెట్టడంతో గాలి నాణ్యత దెబ్బతింటుంది. దీంతో ఆగమేఘాల మీద అధికారులు చర్యలు తీసుకుంటారు. దేశ రాజధానిలో గురువారం నాటికి గాలి కాలుష్య తీవ్రత పెరిగింది. దీంతో అవసరం లేని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. శుక్రవారం (రేపు) ఉదయం 8 గంటల నుంచి గ్రేప్-3 అమలు చేస్తామని వాయు కాలుష్య మండలి (సీఏక్యూఎం) ప్రకటనలో తెలిపింది.
గ్రేప్-3 అంటే
వాయు కాలుష్య తీవ్రతను బట్టి అధికారులు చర్యలు తీసుకుంటారు. వాతావరణంలో గాలి స్వచ్ఛత తగ్గి, తీవ్ర స్థాయికి చేరితే గ్రేప్-3 అమలు చేస్తుంటారు. దీంతోపాటు బీఎస్-3కి చెందిన పెట్రోల్ వాహనాలు, బీఎస్-4కి చెందిన డీజిల్ వాహనాలను ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ద్‌నగర్‌లో అనుమతించరు. జాతీయ భద్రత అంశాలతో ముడిపడి ఉన్న నిర్మాణాలు, ఆరోగ్య విభాగం, ప్రజలకు ఉపయోగ పడే భవనాల నిర్మాణాల విషయంలో మాత్రం నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
అక్టోబర్ 14 నుంచి
‘ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి గాలి నాణ్యత తగ్గుతూ వస్తోంది. ఏక్యూఐ 400 వరకు చేరింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఈ మధ్య గాలి నాణ్యత మరింత తగ్గింది అని’ ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు.పర్వతాల నుంచి మంచు కురవడం వల్ల కూడా ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటానికి కారణం అయ్యింది. దీంతో ఉత్తర భారతదేశం ఉదయం, సాయంత్రం సమయాల్లో వాతావరణం పొడిగా మారిందని వివరించారు. ఢిల్లీలో గాలి నాణ్యత క్రమంగా తగ్గడంతో వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచించారు. ఒకవేళ వెళితే శారీరకంగానే కాదు మానసికంగా ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం.. సాయంత్రం
వాతావరణంలో గాలి నాణ్యత ఉదయం, సాయంత్రం వేళలో దారుణంగా ఉంటుంది. ఈ సమయాల్లో ప్రజలు బయటకు వెళ్లొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్95 మాస్క్ ధరించాలని వైద్యులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Chief Minister: తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారు..
Viral News: డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన రోగి బంధువు.. తర్వాత ఏమైందంటే..