Share News

Delhi : రేపటి నుంచి పార్లమెంటు

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:03 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

Delhi : రేపటి నుంచి పార్లమెంటు

  • తొలిరోజు ఆర్థిక సర్వే.. ఎల్లుండి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, జూలై 20: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం, విశ్లేషణలతోపాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది.

మరోవైపు నీట్‌ ప్రశ్నపత్రం లీకైన కేసు, రైల్వే భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలలో 90 ఏళ్ల నాటి పౌర విమానయాన చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఈ సమావేశాలలో రాజకీయ పార్టీలు ఏఏ అంశాలను లేవనెత్తాలనుకుంటున్నాయో తెలుసుకునేందుకు ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తక్కువగా ఉండేలా బ్యాంకింగ్‌ చట్టాలకు ప్రభుత్వం ఈ సమావేశాలలో సవరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే చర్యలను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ స్పష్టం చేశారు. విపత్తుల నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్‌ బిల్లు, కాఫీ(ప్రచారం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్‌(ప్రచారం, అభివృద్ధి) బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.


సభలో నినాదాలు వద్దు..

సభాధ్యక్షుడు ఇచ్చే రూలింగ్‌లను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ, సభలోగానీ, బయటగానీ విమర్శించకూడదని పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ఎంపీలకు స్పష్టం చేశారు. అలాగే, సభలో వందేమాతరం, జైహింద్‌ సహా నినాదాలేమీ చేయకూడదని తేల్చిచెప్పారు. సభలో ప్లకార్డులు తదితరాలు ప్రదర్శించడమూ పద్ధతి కాదంటూ.. పార్లమెంటరీ ఆచారాలు, సాంప్రదాయాలు, ఎథిక్స్‌పై సభ్యులు దృష్టిపెట్టేలా ‘రాజ్యసభ సభ్యుల కోసం హేండ్‌ బుక్‌’ను రాజ్యసభ సెక్రటేరియట్‌ తీసుకొచ్చింది.

ఈనెల 15న జారీ చేసిన రాజ్యసభ బులెటిన్‌లో ఈ అంశాలను ప్రచురించారు. సభా కార్యకలాపాలను హుందాగా, గంభీరంగా నిర్వర్తించేందుకు థ్యాంక్స్‌, థ్యాంక్యూ, జైహింద్‌, వందేమాతరం తదితర నినాదాలేమీ సభలో చేయకూడదని బులెటిన్‌లో స్పష్టంచేశారు. సభ పూర్వాపరాలను అనుసరించి సభాపతి రూలింగ్‌లు ఇస్తారని, పూర్వాపరాలు లేనిచోట సాధారణ పార్లమెంటరీ పద్ధతిని అనుసరిస్తారని తెలిపారు.

దూషణలు, అభ్యంతరకరమైన, అన్‌పార్లమెంటరీ పదాలు, లేదా వ్యక్తీకరణలను కచ్ఛితంగా నివారించాలంటూ పార్లమెంటరీ ఎథిక్స్‌ను బులెటిన్‌లో ప్రస్తావించారు. ఏదైనా పదం, లేదా వ్యక్తీకరణ అన్‌పార్లమెంటరీ అని సభాధ్యక్షుడు పేర్కొన్నప్పుడు.. దానిపై ఏ విధమైన చర్చనూ లేవనెత్తే ప్రయత్నం చేయకుండా వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టంచేశారు.

Updated Date - Jul 21 , 2024 | 05:03 AM