Share News

Delhi : భారత జనాభా @170 కోట్లు!

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:47 AM

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ ఇప్పటికే రికార్డులకెక్కింది. గత ఏడాదే చైనాను దాటి..,,

Delhi : భారత జనాభా @170 కోట్లు!

  • 2062నాటికి గరిష్ఠానికి చేరనున్న సంఖ్య

  • ఐరాస 2024 నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 11: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ ఇప్పటికే రికార్డులకెక్కింది. గత ఏడాదే చైనాను దాటి, అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 2062వ సంవత్సరానికల్లా భారతదేశ జనాభా 170 కోట్లకు చేరుతుందని ఐరాస నివేదిక వెల్లడించింది. ఇక 2054 నాటికి 100 దేశాల్లో పనిచేసే జనాభా సంఖ్య (20 నుంచి 64 ఏళ్ల వారు) భారీగా పెరుగుతుందని తెలిపింది. ఇలాంటి దేశాల్లో అభివృద్ధికి అపార అవకాశాలు ఉంటాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని పేర్కొంది.

ఉద్యోగాలను సృష్టించేందుకు సంస్కరణలను అమలు చేయాలని, ప్రభుత్వాల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం(2024) 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080 నాటికి 1030 కోట్లకు చేరుతుందని నివేదిక తెలిపింది. 2070 నాటికి ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు, ఆ పైబడిన వారి సంఖ్య 220 కోట్లకు చేరుతుందని.. ఇది 18 ఏళ్లలోపు వారి సంఖ్య కంటే అధికమని పేర్కొంది. ప్రపంచంలోని 63 దేశాల్లో 2024 చివరి వరకు జనాభా గరిష్ఠానికి చేరుతుందని,

మరో 48 దేశాల్లో 2024 నుంచి 2054 మధ్యలో గరిష్ఠానికి చేరుతుందని వివరించింది. భారత్‌, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్‌, అమెరికా సహా మిగిలిన 126 దేశాల్లో 2054 తర్వాత జనాభా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవిత కాలం(ఆయుర్దాయం) కరోనా సమయంలో 70.9 ఏళ్లకు తగ్గగా.. ప్రస్తుతం (2024) అది 73.3 ఏళ్లకు పెరిగిందని తెలిపింది.

Updated Date - Jul 12 , 2024 | 03:47 AM