17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!
ABN , Publish Date - Oct 14 , 2024 | 05:45 AM
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్-ఫార్మేషన్లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.
అబూజ్‌మడ్‌లో భద్రతా బలగాల ఊచకోత
ఎన్కౌంటర్లో మరణించింది 35 మంది
లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
చర్ల, అక్టోబరు 13: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్-ఫార్మేషన్లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు. ఈ నెల 4న జరిగిన ఎన్కౌంటర్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. నాటి ఎన్కౌంటర్లో 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్కౌంటర్లో 35 మంది చనిపోయారని లేఖలో పేర్కొన్నారు. అబూజ్మడ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఆదివారం లేఖ విడుదలైంది. నారాయణపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు తుల్తులి గ్రామ సమీపంలోని అడవుల్లో కాల్పులు జరిగినట్లు మావోయిస్టులు లేఖలో తెలిపారు.
ఎల్-ఫార్మేషన్లో దిగ్బంధిస్తూ ఈ నెల 4న ఉదయం 11:30 నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తం 11 సార్లు భద్రతా బలగాలు తమపై కాల్పులు జరిపాయని వెల్లడించారు. ఈ కాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారని, మరో 17 మంది గాయపడ్డారని తెలిపారు. ఆ 17 మంది క్షతగాత్రులను పట్టుకున్న భద్రతా బలగాలు మరుసటి రోజు(5వ తేదీ) ఉదయం 8 గంటలకు ఊచకోత కోశాయని సంచలన ఆరోపణలు చేశారు.
పోలీసులు, డీఆర్జీ బలగాల ఊచకోతలో మొత్తం 35 మంది సహచరులు అమరులయ్యారని, ఈ ఘటనను అందరూ వ్యతిరేకించాలని లేఖలో పేర్కొన్నారు. చనిపోయిన 35 మంది మావోయిస్టుల పేర్లు, చిరునామాలను వివరించారు. ఘటన జరిగిన ప్రాంతాలను మేధావులు, మీడియా పరిశీలించాలని లేఖలో కోరారు. ఘటనపై న్యాయ విచారణ జరిగేలా, వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలియజేసేలా పోరాటం చేయాలని సామాజిక సంస్థలు, మీడియా ప్రతినిధులను కోరారు.