Hero Vijay: ఇక ప్రజాసేవే లక్ష్యం..
ABN , Publish Date - Aug 23 , 2024 | 10:34 AM
‘ఇప్పటి వరకూ మనకోసం మనం కష్టపడ్దాం. ఇకపై రాష్ట్ర ప్రజల కోసం కూడా పాటుపడదాం’ అంటూ ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్(Vijay) కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- ఇది కేవలం పార్టీ జెండా మాత్రమే కాదు.. భావితరాల విజయానికి ప్రతీక
- ‘తమిళగ వెట్రి కళగం’ అధినేత విజయ్
- పార్టీ పతాకం, పాట ఆవిష్కరణ
చెన్నై: ‘ఇప్పటి వరకూ మనకోసం మనం కష్టపడ్దాం. ఇకపై రాష్ట్ర ప్రజల కోసం కూడా పాటుపడదాం’ అంటూ ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్(Vijay) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఈసీఆర్ పనయూరులో వున్న పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని, పాటను ఆవిష్కరించిన విజయ్.. నేతలనుద్దేశించి ప్రసంగించారు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంతోషకరమైన రోజు ఈ పతాకావిష్కరణ అని అన్నారు. ఫిబ్రవరిలో పార్టీని ప్రారంభించిన తాను.. ఇప్పటికే రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినట్లేనన్నారు.
ఇదికూడా చదవండి: Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు ఊరట లభిస్తుందా?
తన హృదయంలో చెరగని ముద్రవేసుకుని వేసుకున్న అభిమానులు, నేతలు, కార్యకర్తల ముందే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా వుందన్నారు. ఈ పార్టీ పతాకం రూపొందడం వెనుక ఎంతో చరిత్ర వుందని, దాని గురించి మరో రోజు ప్రకటిస్తానన్నారు. ఇప్పుడు ఆవిష్కరించింది కేవలం పార్టీ పతాకం మాత్రమే కాదని, తమిళనాడు భావి తరాలకు అందించే విజయమని వ్యాఖ్యానించారు. ఈ పతాకం ఇంటింటా ఎగరాలని, తద్వారా అందరికీ మంచే జరుగుతుందని విజయ్ పేర్కొన్నారు.
కొద్దిమంది నడుమ.. సాదాసీదాగా..
యువతలో ఎంతో క్రేజ్ వున్న హీరో విజయ్.. పార్టీ పతాకావిష్కరణ ఘనంగా నిర్వహిస్తారంటూ భావించిన రాజకీయ వర్గాల అంచనాలకు భిన్నంగా సాదాసీదాగా, కొద్దిమంది మధ్యలో ఈ కార్యక్రమం ముగిసింది. ఫిబ్రవరిలో పార్టీని స్థాపించిన విజయ్.. 2 కోట్ల మంది సభ్యుల్ని చేర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక సెప్టెంబరు 22వ తేదీన విల్లుపురం జిల్లా విక్రవాండిలో తొలి మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పార్టీ పతాకాన్ని, పాటను పనయూరులోని పార్టీ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు విజయ్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి 300 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. విజయ్ తల్లిదండ్రులైన శోభ, ఎస్‌ఏ చంద్రశేఖర్ కూడా ఉదయం 8.45 గంటలకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
విజయం పార్టీ స్థాపించిన తరువాత వారు ఆ కార్యాలయానికి రావడం ఇదే ప్రథమం. వారికి పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ స్వాగతం పలికారు. నీలాంగరైలో వున్న తన నివాసం నుంచి 8.55 గంటలకు బయలుదేరిన విజయ్.. 9.20 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తెల్ల చొక్కా, చందనం రంగు ప్యాంట్ ధరించిన విజయ్.. కార్యాలయంలోకి రాగానే తన తల్లిదండ్రులకు, పార్టీ నిర్వాహకులకు నమస్కరిస్తూ కూర్చున్నారు. బుస్సీ ఆనంద్ స్వాగతోపన్యాసం అనంతరం. వేదిక ఎక్కిన విజయ్.. పార్టీ నేతల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పతాకాన్ని ఆవిష్కరించారు. వేదిక వెనుకవైపున్న తెరపై పార్టీ పాట వీడియో ప్రదర్శించారు. అనంతరం విజయ్ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి భారీగా విజయ్ అభిమానులు తరలివచ్చారు. వారంతా పార్టీ కార్యాలయం వెలుపలే ఉండడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
విభిన్నంగా పతాకం
కింద,పైనా ఎరుపు, మధ్యలో పసుపు రంగు.. పసుపురంగు మధ్యన రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా, వాటి నడుమ వాగైపుష్పం (దోరిసేన పుష్పం).. చుట్టూ 23 నక్షత్రాలతో పతాకం రూపొందింది.
గుంకీలతో..
విజయ్ ఆవిష్కరించిన తమిళగ వెట్రి కళగం పార్ట్టీ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలతో కూడిన 4.30 నిముషాల నిడివిగల ఈ పాట.. అందరినీ ఆకట్టుకుంటోంది. యజమానులను కూర్చోబెట్టుకున్న కొన్ని మదపుటేనుగులు ప్రజల్ని తొక్కివేస్తుండగా, రెండు గుంకీ ఏనుగులు వాటిని హతమార్చి, ప్రజల్ని రక్షించేలా దృశ్యాలను చిత్రీకరించారు. అలాగే విజయ్ మిగిలిన పార్టీలను అణచివేసి ప్రజల్ని సంరక్షిస్తాడనే భావం వచ్చేలా రూపొందించారు.
వాగై పుష్పం ప్రత్యేకతలెన్నో...
విజయ్ పార్టీ పతాకంలో ఉన్న దోరిసేన పుష్పం ఎన్నో ప్రత్యేకతలు కలిగి వుంది. సంగకాలంలో యుద్ధంలో విజయం సాధించిన రాజులు.. తమ గెలుపు చిహ్నంగా ఈ పుష్పాన్ని ధరించి సంబరాలు జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది. యుద్ధంలో గెలిచిన పురుషులు తమ విజయానికి ప్రతీకగా ఈ పుష్పాన్ని మెడలో వేసుకునేవారని, అదే మహిళలైతే చెవిదుద్దులుగా ధరించేవారు. ఈ పుష్పం దక్షిణాసియాలో లభిస్తుంది. తమిళనాడులో ఇది బహు అరుదు. ఎడారుల్లో పెరిగే మొక్క ఇది. మంచి వాసన కలిగిన ఈ పుష్పం లేత పసుపు, తెలుపు రంగులో ముద్దగా ఉంటుంది.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News