Share News

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:33 AM

మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?

  • బద్లాపూర్‌ ఘటనపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ముంబై, ఆగస్టు 22: మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..

పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల నిరసన పెల్లుబికితే కానీ కేసు నమోదు చేయరా అని నిలదీసింది. బాధిత బాలికల తల్లిదండ్రులు గంటలకొద్దీ పోలీసుస్టేషన్‌లో పడిగాపులు పడాలా అని ప్రశ్నించింది. ఈ నేరాన్ని రిపోర్టు చేయనందుకు పాఠశాల బాధ్యులపైనా ‘పోక్సో’ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


పిల్లలకు పాఠశాలలే సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే ఇక విద్యాహక్కు గురించి మాట్లాడటంలో ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపై పాఠశాల టాయిలెట్‌లో అక్షయ్‌ షిండే అనే స్వీపర్‌ ఈ నెల 13న లైంగిక దాడికి పాల్పడ్డాడు.

పోలీసులు శనివారం నిందితుడిని అరెస్టు చేశారు. అతడికి ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్‌తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం, పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు వేలాది మంది మంగళవారం బద్లాపూర్‌ పెద్దఎత్తున ఆందోళన చేశారు.

ఆ పాఠశాల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు బద్లాపూర్‌లో ఎనిమిది గంటల పాటు రైలు పట్టాలపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Updated Date - Aug 23 , 2024 | 03:34 AM