Share News

Wayanad landslides: వయనాడ్ విషాదానికి కారణమదే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్య

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:09 PM

కేరళలోని వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడి జరిగిన భారీ ఉత్పాతం, ప్రాణనష్టంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. వయనాడ్‌లో అక్రమ గనుల తవ్వకాలు, జనవాసాల వల్లే అపార ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.

Wayanad landslides: వయనాడ్ విషాదానికి కారణమదే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్య

న్యూఢిల్లీ: వయనాడ్‌ (Wayanad)లో కొండచరియలు విరిగిపడి జరిగిన భారీ ఉత్పాతం, ప్రాణనష్టంపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలను కేరళ సర్కార్ పట్టించుకోలేదని కేంద్ర అమిత్‌షా ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సోమవారంనాడు మరో సంచలన ఆరోపణ చేశారు. వయనాడ్‌లో అక్రమ గనుల తవ్వకాలు, జనవాసాల వల్లే అపార ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.


అక్రమ జనావాసాలకు స్థానిక రాజకీయవేత్తల రక్షణ ఉందని, కనీసం టూరిజం పేరుతో సరైన జోన్లను కూడా వాళ్లు ఏర్పాటు చేయలేదని, ఈ ప్రాంతంలో భూకజ్జాలు జరిగాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం 'హైలీ సెన్సిటివ్ ఏరియా' అని తెలిపారు. అటవీ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సారథ్యంలో తాము ఇప్పటికే ఒక కమిటీ వేశామని, స్థానిక ప్రభుత్వ యంత్రాగం పరిరక్షణలో అక్కడి అక్రమ జనావాసాలున్నాయని, అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నాయని భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

Wayanad Landslides: నాలుగు మృతదేహాలే దొరికాయంటూ మన్సూర్ ఆవేదన


222కు చేరిన మృతులు

కాగా, వయనాడ్‌లో గత వారం కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 222కు చేరింది. వీరిలో 99 మంది పురుషులు, 88 మంది మహిళలు, 37 మంది పిల్లలు ఉన్నారని సీఎంఓ తాజా గణాంకాలను వెల్లడించింది. వీరిలో 172 మృతదేహాలను బంధువులు గుర్తించారని, వివిధ ప్రాంతాల నుంచి 180 మృతదేహాల విడిభాగాలు లభ్యమయ్యాయని, 161 పోస్టుమార్టంలు పూర్తయ్యాయని తెలిపింది. వయనాడ్‌, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో 91 మంది చికిత్స పొందుతుండగా, 256 మందిని ఇప్పటికే ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు.


జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు బీజేపీ నిరాకరణ

వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వ గైడ్స్‌లైన్ ప్రకారం జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశమే లేదని బీజేపీ తెలిపింది. దీనిపై యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి విధానపరమైన నిర్ణయంలో ఎలాంటి మార్పు జరగలేదని తెలిపింది. ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించే ప్రొవిజన్ ఏదీ లేదని 2013 ఆగస్టు 6న అప్పటి హోం మంత్రి ముల్లపల్లి రామచంద్రన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని బీజేపీ సీనియర్ నేత వి.మురళీధరన్ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 03:11 PM