Mallikarjun Kharge: మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ
ABN , Publish Date - Nov 19 , 2024 | 06:59 PM
మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur)లో మళ్లీ హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharg) ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఖర్గే లేఖ (Letter) రాశారు. మణిపూర్లో శాంతిని పునరుద్ధరించడంలో కేంద్రం, బీజేపీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. గత ఏడాది మణిపూర్లో జాతుల ఘర్షణతో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాంలో పర్యటించకపోవడాన్ని ప్రశ్నించారు.
Maharashtra Exit polls: మహారాష్ట్ర, జార్ఖాండ్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే
''మణిపూర్ గత 18 నెలలుగా ఆసాధారణ రీతిలో కల్లోల పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో దేశం పెను విషాదాన్ని చవిచూస్తోంది. హింసాత్మక ఘటనల్లో మహిళలు, చిన్నారులు, అప్పుడే పుట్టిన శిశువులు సహా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై శరణార్ధి శిబిరాల్లో బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రజల బాధలు వర్ణనానీతం'' అని ఖర్గే రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంశాంతి కారణంగా మణిపూర్ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. వ్యాపారాలు మూతపడ్డాయని, ఉపాధులు పోయాయాని, ప్రొఫెషనల్స్ సొంత ఇళ్లు కూడా విడిచిపెట్టి వెళ్లిపోయారని, నిత్యావసరాలైన ఆహారం, మందుల కొరత ఎక్కువైందని, 2023 నుంచి జాతీయ రహదారులు దిగ్బంధం చేశారని, స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయని, నిరాశ్రయులై శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మణిపూర్ ప్రజల మూగవేదన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని ఆ లేఖలో ఖర్గే రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మూడుసార్లు మణిపూర్లో పర్యటించారని, ప్రధాని మాత్రం ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదని ఖర్గే పేర్కొన్నారు. ''మణిపూర్ ప్రజల డిమాండ్ చేసినప్పటికీ 2023 మే నుంచి ఇంతవరకూ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటించలేదు. లోక్సభలో ప్రతిపక్ష నేత గత 18 నెలల్లో మూడుసార్లు పర్యటించారు. ఈ కాలంలో నేను కూడా మణిపూర్ వెళ్లాను. మణిపూర్ పర్యటనకు ప్రధాని ఎందుకు వెళ్లడం లేదో ఎవరికీ అర్ధం కావడం లేదు'' అని ఖర్గే అన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం, ఉద్దేశపూర్వక జాప్యం వల్ల చట్టం నిర్వీర్వమై, మానవహక్కుల ఉల్లంఘన రాజ్యమేలుతుందని, ఇది జాతీయ భద్రతతో రాజీపడటం, దేశ ప్రజల ప్రాథమిక హక్కులను అణిచివేయడం అవుతుందని తాను, తమ పార్టీ బలంగా నమ్ముతున్నట్టు ఖర్గే పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 19వ నిబంధన ప్రకారం గౌరవంగా జీవనం సాగించే హక్కును కాలరాయడమే అవుతుందన్నారు. రాజ్యాంగ అనివార్యతల రీత్యా, రాజ్యాంగ 'కస్టోడియన్'గా తక్షణం మణిపూర్ ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన కోరారు. మీ జోక్యంతో మణిపూర్ ప్రజలు తిరిగి తమ ఇళ్లలో పూర్తి భద్రత, గౌరవప్రదమైన జీవనం సాగిస్తారని తాను బలంగా నమ్ముతున్నట్టు ఆ లేఖలో ఖర్గే పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ల దాడి
అమెరికా పోలీసుల అదుపులో అన్మోల్ బిష్ణోయ్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..