Haunting: దెయ్యం పేరు చెప్పి 51 తులాల బంగారం, 31 లక్షలు కాజేశారు..
ABN , Publish Date - Jun 11 , 2024 | 08:58 AM
ఇద్దరు మోసగాళ్లు దయ్యాల పేరుతో డాక్టర్‌ను, ఆయన భార్యను భయపెట్టారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 31 లక్షల నగదు, సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకోండి..
Black Magic: ప్రపంచం మొత్తం టెక్నాలజీని నమ్ముకుని అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. మనం దేశంలో కొందరు మాత్రం మూఢ నమ్మకాల ఊబిలో నలిగిపోతున్నారు. చదుకోనివారే కాదు.. చదువుకున్నవారు సైతం మూఢ నమ్మకాలకు బలైపోతున్నారు. తాజాగా ఓ డాక్టర్ సైతం మూఢనమ్మకాలను విశ్వసించి ఒకటి కాదు రెండు కాదు 51 తులాల బంగారం, రూ. 31 లక్షల నగదు మోసపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని అశోకా గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ అశోకా గార్డెన్‌లో నివాసం ఉంటున్నారు డాక్టర్ హరిరామ్ పిప్పల్, మీరా దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారి చిన్న కొడుక్కి ఇటీవల మూడుసార్లు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కంగారుపడిపోయారు డాక్టర్, ఆయన భార్య. ఈ విషయాన్ని తమ సన్నిహితుడైన అబ్దుల్ సోహైల్‌కు చెప్పారు. దీన్ని అవకాశంగా భావించిన సోహైల్.. మీ పిల్లలను దెయ్యం వెంటాడుతందని నమ్మించాడు. అది విన్న దంపతులు భయపడిపోయారు. ఒక తాంత్రికుడు ఉంటే చెప్పమని కోరారు. దీంతో ఎవరో ఎందుకు తానే మంత్రాలు చేస్తానని.. పిల్లాడికి ఏం కాకుండా చూస్తానని భరోసా ఇచ్చాడు సోహైల్.
ఆ తరువాత సోహైల్ తన స్నేహితుడు ఫరాజ్‌కు ఫోన్ చేసి మ్యాటర్ అంతా చెప్పాడు. తాంత్రిక క్రియ పేరుతో వారి నుంచి దోచుకునేందుకు ఇద్దరూ భారీ కుట్ర చేశారు. ఈ క్రమంలోనే.. మంత్రాల పేరుతో వైద్యుడి ఇంట్లోకి ఎంటరైన సోహైల్, అతని స్నేహితుడు ఫరాజ్ ఇంట్లో ఉంచిన బంగారం, నగదును ఒక బ్యాగ్‌లో పెట్టి ఉంచాలని సూచించారు. వారు చెప్పింది నమ్మిన దంపతులు.. నగదు, బంగారంను ఒక బ్యాగ్‌లో పెట్టారు. అవకాశం కోసం చూసిన సొహైల్, ఫరాజ్.. అదును చూసి ఆ డబ్బు, బంగారం కాజేశారు. కొద్ది రోజుల తరువాత బ్యాగ్‌లోని డబ్బులు, బంగారం కనిపించకపోవడంతో షాక్ అయిన డాక్టర్, ఆయన భార్య మిరా తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే అశోకా గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడైన సొహైల్‌ను పట్టుకున్నారు. కాజేసిన నిధులను ఖర్చు చేశామని.. బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టామని చెప్పాడు నిందితుడు. దీంతో తనఖా పెట్టిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సోహైల్ సహచరుడు ఫరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తంగా నిందితుల నుంచి 33.3 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొమ్ము రికవరీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.