భారత్‌కూ ఐరన్ డోమ్!
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:16 AM
భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో... రష్యా గగనతలానికి రక్షణ వలయంగా నిలుస్తున్న....
త్వరలోనే దేశానికి పాంట్‌సిర్ గగనతల రక్షణ వ్యవస్థ
రష్యా కంపెనీతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ, నవంబరు 11: భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో... రష్యా గగనతలానికి రక్షణ వలయంగా నిలుస్తున్న అత్యాధునిక పాంట్‌సిర్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్-గన్ వ్యవస్థ త్వరలోనే భారత్‌కు కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్).. రష్యాకు చెందిన ఆయుధ ఎగుమతిదారు రోసోబొరోనెక్స్‌పోర్ట్ (ఆర్‌వోఈ)తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలో జరిగిన ఇండియా-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్‌ఐజీసీ) సబ్ గ్రూప్ సమావేశంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత్, రష్యా మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని ఈ భాగస్వామ్యం నొక్కిచెబుతోంది.
పాంట్‌సిర్ రక్షణ వ్యవస్థ సామర్థ్యం
పాంట్‌సిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది విమానాలు, డ్రోన్లు, క్షిపణులతోపాటు సైనిక స్థావరాలకు గగనతలం నుంచి వచ్చే ముప్పుని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి రూపొందించిన అత్యాధునిక మొబైల్ రక్షణ వ్యవస్థ. దీనిలో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన స్వల్ప, మధ్య శ్రేణి క్షిపణులు ఉంటాయి. అలాగే డ్యూయల్ 30ఎంఎం ఆటోమేటిక్ ఫిరంగులు బహుళ అంచెల రక్షణను అందిస్తాయి. అత్యాధునిక రాడార్, ఎలకో్ట్ర-ఆప్టికల్ ట్రాకింగ్‌ను కలిగి ఉన్న పాంట్‌సిర్ వ్యవస్థ 36 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరే లక్ష్యాలను గుర్తించి అలవోకగా ఛేదించగలదు. వేగంగా దూసుకొచ్చే శత్రు ఆయుధాలను అంతే వేగంగా ప్రతిస్పందించి తిప్పికొట్టగలదు. రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించాలనే భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, రోసోబొరోనెక్స్‌పోర్ట్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఉత్పత్తి, సాంకేతికత బదిలీ, పాంట్‌సిర్ వేరియంట్ల ఉమ్మడి అభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించాలని బీడీఎల్, ఆర్‌వోఈ లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ నెలాఖరులో రష్యా నుంచి మరో యుద్ధనౌక
రష్యాలో నిర్మిస్తున్న రెండు గైడెడ్ క్షిపణి వ్యవస్థ కలిగిన యుద్ధనౌకల్లో మొదటిది ఈ నెలాఖరులోగా భారత్‌కు చేరనుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వీటి డెలివరీ ఆలస్యమైంది. అలాగే.. రష్యా అందజేయాల్సిన మిగిలిన రెండు ‘ఎస్-400’ ట్రయంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు 2026 నాటికి భారత్‌కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 4,000 టన్నుల బరువున్న యుద్ధనౌకను కొన్ని నెలలుగా కలినిన్ గ్రాడ్‌లోని యాంటార్ షిప్‌యార్డులో మోహరించారు. డిసెంబరు మొదటి వారంలో రష్యాను సందర్శించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను అప్పగించనున్నారు. భారత్ దీన్ని ఐఎన్‌ఎస్ తుశీల్‌గా ప్రారంభించనుంది. కాగా, ఈ శ్రేణిలో మరో యుద్ధనౌకను వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు అప్పగించనున్నట్టు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా నుంచి నాలుగు గ్రిగొరోవిచ్ క్లాస్ యుద్ధనౌకల కొనుగోలుకు భారత్ 2018 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకోగా.. రూ.8వేల కోట్లతో వాటిలో తొలి రెండు నౌకలను ఇప్పటికే అందుకుంది.