Modi Washing Powder: 'మోదీ వాషింగ్ పౌడర్'తో కళంకితులకు క్లీన్ చిట్.. కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన
ABN , Publish Date - Mar 30 , 2024 | 07:21 PM
ఎంతటి కళంకిత వ్యక్తులైనా బీజేపీలో చేరితే వారికి ఆ పార్టీ క్లీన్‌చిట్ ఇచ్చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ వాషింగ్ పౌడర్‌తో ఎన్ని కళంకాలైనా బీజేపీ వాషింగ్ మిషన్‌లో వేసి బయటకు తీస్తే మటుమాయం అవుతాయని తెలిపింది.
న్యూఢిల్లీ: ఎంతటి కళంకిత వ్యక్తులైనా బీజేపీలో చేరితే వారికి ఆ పార్టీ ''క్లీన్‌చిట్'' ఇచ్చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ''మోదీ వాషింగ్ పౌడర్'' (Modi Washing powder) తో ఎన్ని కళంకాలైనా ''బీజేపీ వాషింగ్ మిషన్"లో వేసి బయటకు తీస్తే మటుమాయం అవుతాయని తెలిపింది. ఈ ప్రక్రియ ఎలాగో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర (Pawan Khera) శనివారంనాడు మీడియా సమావేశంలో ఒక ప్రదర్శన నిర్వహించి మరీ చూపించారు. 2017లో ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌పై పెట్టిన అవినీతి కేసును సీబీఐ మూసివేస్తూ క్లోజర్ రిపోర్ట్ ప్రకటించిన కొద్ది సేపటికే పవన్ ఖేర మీడియా సమావేశంలో స్పందించారు.
కాంగ్రెస్ డిమానిస్ట్రేషన్
మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన డిమానిస్ట్రేషన్‌లో వేదికపై ''బీజేపీ వాషింగ్ మిషన్'' అనే పేరుతో వాషింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. అవినీతి, మోసాలు, కుంభకోణాలు, అత్యాచారాలు వంటి రాతలతో ఉన్న టీ-షర్ట్‌ను అందరికీ చూపించారు. అనంతరం ఆ టీ-షర్ట్‌ను వాషింగ్ మిషన్‌లో వేసి బయటకు తీయగానే దానిపై ఉన్న మరకలన్నీ చెరిగిపోయి ''బీజేపీ మోదీ వాష్'' అనే రాతలతో తళతళలాడుతూ టీ-షర్డ్ బయటకు వచ్చింది.
బీజేపీ మిషన్ ధర రూ.8,500 కోట్లు
ఈ సందర్భంగా పవన్ ఖేర మాట్లాడుతూ, బీజేపీ మెషీన్ ధర రూ.8,500 కోట్లు అని, ఈ సొమ్మంతా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికార పార్టీ (బీజేపీ)కి వచ్చాయని చెప్పారు. ఈ మిషన్‌లో అన్నిరకాల అవినీతి మరకలు మోదీ వాషింగ్ పౌడర్‌తో కలిసి వేస్తే మటుమాయమవుతాయని అన్నారు. 'మోదీ వాషింగ్ పౌడర్' కరపత్రాన్ని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అందరికీ పంచారు.
పార్టీలో చేరినందుకే పటేల్‌కు క్లీన్‌చిట్..
ప్రఫుల్ పటేల్ ఎన్‌సీపీని చీల్చి మహారాష్ట్రలోని బీజేపీ కూటమిలో కొద్ది నెలల క్రితం చేరారని, దాంతో ఆయనపై ఉన్న అవినీతి కేసులను మూసివేస్తున్నట్టు ఇప్పుడు సీబీఐ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చిందని పవన్ ఖేర చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఉన్న ప్రఫుల్ పటేల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు 2006లో సీబీఐ ఆరోపించిందన్నారు. 2019లో కూడా ఆయనకు ముంబై పేలుళ్ల నిందితుడు ఇక్బాల్ మిర్చితో ప్రాపర్టీ డీల్‌లో ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపించిందని చెప్పారు. పటేల్-మిర్చి మధ్య ఉన్న ప్రాపర్టీ డీల్‌పై తమ సచ్ఛీలత నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ను బీజేపీ జాతీయ కార్యదర్శి సంబిత్ పాత్ర నిలదీసిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు ప్రఫుల్ పటేల్ బీజేపీ కూటమిలో చేరగానే ఆ ఆరోపణలన్నీ మటుమాయమయ్యాయా అని ప్రశ్నించారు. బీజేపీ అవినీతి ఆరోపణలు చేసిన దాదాపు 21 మంది నేతలు ఆ పార్టీలోకి చేరగానే క్లీన్‌చిట్ పొందారని ఖేర వెల్లడించారు. వారిలో అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, నారాయణ్ రాణే, అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, అశోక్ చవాన్ వంటి పలువురు ఉన్నారని అన్నారు.