విగ్రహాల ధ్వంసం విచారకరం: థరూర్
ABN , Publish Date - Aug 13 , 2024 | 03:25 AM
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం కోరారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం కోరారు. బంగ్లాదేశ్‌లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, మందిరాలు, హిందువుల ఇళ్లపై దాడులు అవమానకరమన్నారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు చేయడాన్ని బట్టి చూస్తే కొందరు ఆందోళనకారుల అజెండా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బంగ్లాదేశ్ విమోచనానికి సంబంధించిన దృశ్యాలతో ముజిబ్‌నగర్‌లోని 1971 షాహిద్ మెమోరియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు.
ఇలాంటి పరిణామాలు విచారకరమన్నారు. హసీనాకు ఆశ్రయం కల్పించి కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుందని శశిథరూర్ అన్నారు.