National : కల్లోల బంగ్లాలో తెలుగు పరిమళం!
ABN , Publish Date - Aug 18 , 2024 | 03:15 AM
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్‌కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్)లోనే ఉండిపోయారు.
(గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్‌కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్)లోనే ఉండిపోయారు. ఢాకా, సిలేటు ప్రాంతాల్లో కొన్ని తెలుగు కుటుంబాలూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తెలుగువారి సంఖ్య వేలల్లోకి చేరింది. వీరిలో ఎక్కువగా ఏపీలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. తమ రక్తంలో ఇప్పటికీ తెలుగు సంస్కృతి ఉందని, ఇంట్లోనూ తెలుగులోనే మాట్లాడతామని చెప్పారు. అయితే తాము ముమ్మాటికీ బంగ్లాదేశ్ జాతీయులమేనని, బంగ్లాదేశ్ పౌరులమని చెప్పుకొనేందుకు గర్వపడతామని తెలుగు సంతతికి చెందిన ఏసు రత్నం పేర్కొన్నారు.
చివరిసారిగా 2017లో ఏపీని సందర్శించినట్లు ఆయన చెప్పారు. సుందర్బన్ తీరంలోని సీలేటులో ఉంటున్న చొంప నాయుడు అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భారత దౌత్యకార్యాలయంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు ప్రతి ఏడాది తప్పకుండా హాజరవుతుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించే ఆమె, కొద్దికాలం క్రితమే తిరుమలకు వచ్చి వెళ్లారు.
దుబాయిలో డ్రైవర్‌గా పనిచేసే రాజు, సౌదీలో డాక్టర్‌గా పనిచేస్తున్న శశిధర్ తమ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే తాము బంగ్లాదేశీయులమని చెప్పుకొంటారు.
ఇలా దేశ విభజన సమయంలో కొన్ని కుటుంబాలు బంగ్లాదేశ్‌లోనే ఉండిపోగా... మరికొన్ని హిందూ కుటుంబాలు మాత్రం పాక్ సైన్యం దాష్టీకాలను భరించలేక తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌కు శరణార్థులుగా వచ్చారు. ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాల పరంగా వీరు బెంగాల్ వారే. ఇప్పుడు వీరు అచ్చమైన భారతీయులు. ప్రతి సంవత్సరం జరిగే వేడుకల్లో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొంటారు. కాగజ్‌నగర్ మండలంలో ప్రఖ్యాత బెంగాల్ కవి నజ్రూల్ పేరిట ఉన్న నజ్రుల్ నగర్ గ్రామంలో ప్రతి ఏడాది జరిగే దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొంటారు. సిర్పూర్-కాగజ్‌నగర్‌లో వీరిది కీలక ఓటు బ్యాంకు కావడం గమనార్హం.