Karnisena chief murder: కర్ణిసేన చీఫ్ హత్యకేసులో 31 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు, కీలక నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Jan 03 , 2024 | 07:52 PM
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో కుమార్ అనే కీలక అనుమానితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారంనాడు అరెస్టు చేసింది. కుమార్ నివాసంలో పలు ఆయుధాలు, అమ్యునేషన్ స్వాధీనం చేసుకుంది.
జైపూర్: రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది (Sukhadev Singh Gogamedi) హత్య కేసులో కుమార్ అనే కీలక అనుమానితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారంనాడు అరెస్టు చేసింది. కుమార్ నివాసంలో పలు ఆయుధాలు, అమ్యునేషన్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో గోగమేది హత్యకు ఇద్దరు షూటర్లను ప్రేరిపించిన కీలక నిందితుడు రోహిత్ గొదారాతో కుమార్‌కు సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. హర్యానా, రాజస్థాన్‌లో ఎన్ఐఏ విస్తృతంగా జరిపిన దాడుల్లో ఇంతవరకూ తొమ్మిది మంది అనుమానితులు అరెస్టయ్యారు.
జైపూర్‌లో గత డిసెంబర్ 5న గోగమేది దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు ఆయన నివాసంలో గోగమేదితో మాట్లాడుతూనే హఠాత్తుగా ఆయనపై కాల్పుల్లో జరిపారు. గోగమేది అక్కడికక్కడే మరణించగా, కాల్పుల్లో మరో వ్యక్తి కూడా హతమయ్యాడు. రాజస్థాన్ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించడంతో తొలుత రాజస్థాన్ పోలీసులు కేసు దర్యాప్తు జరిపి ఆ తర్వాత ఎన్ఐఏకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బుధవారంనాడు రాజస్థాన్, హర్యానాలోని 31 ప్రాంతాల్లో దాడులు జరిపింది.