Share News

Nitin Gadkari : పాత కార్లు ‘తుక్కు’కిస్తే.. కొత్త వాటిపై కిక్కు!

ABN , Publish Date - Aug 28 , 2024 | 04:30 AM

పండగ రోజుల్లో కొత్త కారు కొనుక్కోవాలనుకునే వారికి శుభవార్త. పాత కార్లను తుక్కు కింద ఇచ్చేసి, ఆ సర్టిఫికెట్‌ తీసుకెళ్తే.. కొత్త కార్లపై డిస్కౌంట్‌ అందించనున్నట్లు ఆటోమొబైల్‌ కంపెనీలు వెల్లడించాయి.

Nitin Gadkari : పాత కార్లు ‘తుక్కు’కిస్తే.. కొత్త వాటిపై కిక్కు!

  • పాత వాహనాల స్ర్కాప్‌ సర్టిఫికెట్‌ తీసుకెళ్తే..

  • కొత్త వాహనాల ఎక్స్‌షోరూం ధరపై డిస్కౌంట్‌

  • ప్రయాణికుల వాహనాలపై 1.5% లేదా రూ.20వేలు

  • వాణిజ్య వాహనాలపై 3 శాతం వరకు తగ్గింపు

  • కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీలో కంపెనీల అంగీకారం

న్యూఢిల్లీ, ఆగస్టు 27: పండగ రోజుల్లో కొత్త కారు కొనుక్కోవాలనుకునే వారికి శుభవార్త. పాత కార్లను తుక్కు కింద ఇచ్చేసి, ఆ సర్టిఫికెట్‌ తీసుకెళ్తే.. కొత్త కార్లపై డిస్కౌంట్‌ అందించనున్నట్లు ఆటోమొబైల్‌ కంపెనీలు వెల్లడించాయి. పాత వాహనాలకు ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌’ను తీసుకొచ్చిన వినియోగదారులకు కొత్త వాహనాలపై 1.5 నుంచి 3 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపాయి.

మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ‘భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘాని (సియామ్‌)’కి చెందిన పలువురు సీఈవోలతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. కొత్త వాహనాలపై డిస్కౌంట్లు అందజేసేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. ప్రయాణికుల వాహనాలపై ఏడాది పాటు, వాణిజ్య వాహనాలపై రెండేళ్ల పాటు ఈ డిస్కౌంట్లు అందించేందుకు తయారీదారులు అంగీకరించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

కార్లకు స్ర్కాప్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చిన వారికి కొత్త కార్ల ఎక్స్‌ షోరూం ధరపై 1.5 శాతం లేదా రూ.20 వేలు.. ఏది తక్కువైతే అది అందజేస్తారు. ఇక టాటా మోటార్స్‌, అశోక్‌ లే లాండ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫోర్స్‌ వంటి వాణిజ్య వాహనాల తయారీ సంస్థలు.. 3.5 టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన రవాణా వాహనాల ఎక్స్‌ షోరూం ధరపై 3ు వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డిస్కౌంట్లు అందించేందుకు అంగీకరించిన వాహన తయారీ సంస్థలకు గడ్కరీ అభినందనలు తెలిపారు. వాహనాల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగస్వాములైన కంపెనీలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Aug 28 , 2024 | 04:30 AM