Share News

Odisha: సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:36 PM

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.

Odisha: సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు

భువనేశ్వర్, జూన్ 12: ఒడిశా నూతన ముఖ్యమంత్రి (chief minister of Odisha)గా మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. మోహన్ చరణ్‌తోపాటు ఎమ్మెల్యేలు పార్వతీ పరీదా (Pravati Parida), కనక్ వర్ధన్ సింగ్‌దేవ్‌ (Kanak Vardhan Singh Deo) లు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. ఇక మోహన్ చరణ్ కేబినెట్‌లో 12 మందికి మంత్రులగా చేరనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Chhattisgarh Governor Biswabhusan Harichandan) కుమారుడు పృధ్వీరాజ్ హరిచందన్‌ (Prithiviraj Harichandan)కు సైతం ఈ కేబినెట్‌లో చోటు దక్కనుందని సమాచారం.


అయితే ఒడిశా సీఎం రేసులో బీజేపీలోని పలువురు సీనియర్ల పేర్లు వినిపించాయి.ఆ క్రమంలో మంగళవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్రయాదవ్‌లు.. ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో భువనేశ్వర్‌లో సమావేశమయ్యారు. అందులోభాగంగా షెడ్యుల్ తెగలకు చెందిన ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ పేరును ఒడిశా సీఎంగా ఎంపిక చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారని తెలుస్తుంది.


147 మంది ఎమ్మెల్యేలున్న ఒడిశా అసెంబ్లీకి నాలుగు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఒడిశా ఓటరు.. బీజేపీకి పట్టం కట్టాడు. దీంతో రెండు దశాబ్దాలుగా సాగుతున్న బీజేడీ పాలనకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 78 స్థానాలను గెలుచుకుంది. ఇక అధికార బీజేడీ మాత్రం 51 స్థానాలకు పరిమితమైంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కేవలం 14 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 01:38 PM