Share News

Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత కీలక నిర్ణయం.. రంగంలోకి పోలీసులు

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:16 PM

ఒడిశాలోని వివిధ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత కీలక నిర్ణయం.. రంగంలోకి పోలీసులు

భువనేశ్వర్, నవంబర్ 11: ఒడిశాలోని బెర్హంపూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మావోయిస్ట్ అగ్రనేత సవ్యసాచి పాండ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా స్టేట్ ఒపెన్ యూనివర్సిటీ ద్వారా ఎమ్ఏ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నట్లు ఆయన జైలు అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలో బెర్హంపూర్ సర్కిల్ జైలు ఎస్పీ డీఎన్ బరిఖ్ బుధవారం స్పందించారు. జైల్లో మొత్తం ఆరుగురు ఖైదీలు ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఖైదీలను సంబంధించిన పత్రాలను ఇప్పటికే యూనివర్సిటీకి పంపినట్లు ఆయన వివరించారు. వీరి పేర్లు యూనివర్సిటీలో ఎన్ రోల్ కాగానే.. ఈ కోర్సుకు సంబంధించిన స్టడీ మెటిరియల్ అందజేస్తామని చెప్పారు. జైల్లోనే వారు స్వయంగా చదువుకుని.. ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.


రెండేళ్ల క్రితమే సవ్యసాచి పాండ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని జైలు ఎస్పీ గుర్తు చేశారు. అలా బీఏ పట్టా అందుకున్న.. ఆయన ఎమ్ఏ పట్టా అందుకునేందుకు కష్టపడుతున్నారని చెప్పారు. సవ్యసాచి పాండ వయస్సు ప్రస్తుతం 55 ఏళ్లు అని జైలు ఎస్పీ స్పష్టం చేశారు. ఏమ్ఏ చదువుతున్న వారిలో ఇద్దరు ఖైదీలు ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారన్నారు.


ఒడిశాలోని వివిధ జిల్లాల్లో జరిగిన విధ్వంసాల్లో మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పాండ ప్రమేయం ఉందనే అరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2014, జులై 14న పాండను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడికి స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. నాటి నుంచి ఆయన బెర్హంపూర్ జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నారు.


మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులు లేని దేశంగా మార్చాలని మోదీ, అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. మావోయిస్టులను నిర్మూలించారు. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వీరి జాడ ఎక్కడ లేకుండా పోయింది.


కానీ ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ప్రభావం కొద్దిగా ఉంది. ఈ నేపథ్యంలో అబూజ్ మాడ్ లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీంతో ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో వరుస ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దాంతో మావోయిస్టులకు వరుస దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇంకోవైపు మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర ఇప్పటికే పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. జన జీవన స్రవంతిలో కలిసి.. దేశ నిర్మాణంలో భాగస్యామ్యం కావాలని మావోయిస్టులను రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సూచించిన విషయం విధితమే.

For National News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 03:18 PM