పాక్ న్యాయవ్యవస్థకు పార్లమెంటు సంకెళ్లు!
ABN , Publish Date - Oct 22 , 2024 | 05:26 AM
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా.. 25వ రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
స్వయం ప్రతిపత్తికి పాతరవేసే రాజ్యాంగ సవరణకు ఆమోదం
ఇస్లామాబాద్, అక్టోబరు 21: ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా.. 25వ రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు అధికారాలను, ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని ప్రభావితం చేసే సవరణ ఇది. దేశమంతా గాఢనిద్రలో మునిగి ఉన్న సమయాన.. ఆదివారం అర్ధరాత్రి వేళ 11.36 గంటల సమయంలో సమావేశమై.. తెల్లవారుజామున 5 గంటల దాకా సాగిన పార్లమెంటు సెషన్లో ఉభయసభలూ ఈ సవరణకు ఆమోదం తెలిపాయి. అనంతరం పాకిస్థాన్ ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీ సైతం ఆగమేఘాలపై ఈ చట్టానికి పచ్చజెండా ఊపారు. ఇందులోని కీలక అంశాలు..
పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలాన్ని ఈ సవరణ ద్వారా మూడేళ్లకు పరిమితం చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి కొత్తగా 12 సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో.. ప్రస్తుత చీఫ్ జస్టిస్, నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు, ఇద్దరు సెనెటర్లు, ఇద్దరు జాతీయ అసెంబ్లీ సభ్యులు, విపక్ష సభ్యుడొకరు ఉంటారు.
ఏదైనా కేసును సుమోటోగా స్వీకరించేందుకు సుప్రీం కోర్టుకున్న అధికారాన్ని ఈ సవరణ ద్వారా తొలగించేశారు.
న్యాయవ్యవస్థలో జవాబుదారీతనాన్ని, సమర్థతను పెంచేందుకు పనితీరు అంచనా వ్యవస్థను ప్రవేశపెట్టారు. అంతూ పొంతూ లేకుండా ఏళ్లతరబడి కొనసాగే కేసుల విషయంలో ప్రజల ఫిర్యాదులను పరిశీలించే వ్యవస్థ ఇది.
సమాజంలోని అన్నివర్గాల వారికీ న్యాయనియామకాల్లో ప్రాతినిధ్యం ఉండేలా నిబంధనలను పొందుపరచారు. కాగా ఈ సవరణలు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని వ్యతిరేకులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని, జవాబుదారీ తనాన్ని పెంచుతాయని దీన్ని సమర్థించేవారు చెబుతున్నారు