Share News

PM Narendra Modi: నేనలా అనలేదు.. హిందూ-ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ

ABN , Publish Date - May 15 , 2024 | 11:51 AM

ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘చొరబాటుదారులు’, ‘ఎక్కువమంది పిల్లలున్న వారు’..

PM Narendra Modi: నేనలా అనలేదు.. హిందూ-ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ

ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై (Congress) విమర్శలు గుప్పిస్తూ.. ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘చొరబాటుదారులు’, ‘ఎక్కువమంది పిల్లలున్న వారు’ అనే పదాలను ఆయన వినియోగించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇచ్చారు. తాను కేవలం ముస్లింలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. అధిక సంతానంతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబం గురించి ఆ మాటలు అన్నానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడైతే హిందూ, ముస్లిం (Hindu-Muslim) అంటూ వేరు చేసి మాట్లాడుతానో.. ఆ రోజు నుంచి ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానని అన్నారు.

26 ఏళ్ల క్రితం తప్పిపోయాడు.. తీరా చూస్తే 200 మీటర్ల దూరంలోనే..

ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘నేను ముస్లింల పట్ల ప్రత్యేక ప్రేమను కనబరచను. నేను ఓటు బ్యాంకు కోసం నేను పనిచేయను. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ (Sabka Saath Sabka Vikas) నినాదాన్నే నమ్ముతాను. కానీ.. ఆరోజు ప్రచారంలో నేను చేసిన వ్యాఖ్యలను కేవలం ముస్లింలకే ఆపాదించడం చూసి షాక్‌కి గురయ్యాను. అధిక సంతానం ఉన్నవారి గురించి మాట్లాడితే.. అది ముస్లింలను ఉద్దేశించే మాట్లాడానని ఎవరు చెప్పారు? సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబంలోనూ అధిక సంతాన సమస్య ఉంది. అదే నేను చెప్పానే తప్ప.. ఏ సామాజిక వర్గం పేరుని ప్రత్యేకంగా ఎత్తలేదు. ఎంతమంది పిల్లల బాగోగులు చూసుకోగలరో అంతమందినే కనాలి. ప్రభుత్వమే మీ పిల్లల బాగోగులు చూసుకోవాలనే పరిస్థితి రాకూడదనే చెప్పాను’’ అని చెప్పుకొచ్చారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?

ఇదే సమయంలో.. 2002లో గోద్రా అల్లర్ల ప్రస్తావనని తీసుకొచ్చి, ఆ ఘటన తర్వాత ప్రత్యర్థులు తన ప్రతిష్టతను ముస్లిం వర్గంలో దెబ్బతీశారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. తన చిన్నతనంలో ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవని, తమ ఇంట్లో కూడా మిగతా పండుగలతో పాటు ఈద్ నిర్వహించేవాళ్లమని ప్రధాని మోదీ అన్నారు. ఈద్ రోజున తమ ఇంట్లో వంట చేసుకునేవాళ్లు కాదని, ముస్లిం కుటుంబాల నుంచే తమకు ఆహారం వచ్చేదని గుర్తు చేసుకున్నారు. మొహర్రంలోనూ భాగమయ్యేవాళ్లమని, ఇప్పటికీ తన స్నేహితుల్లో చాలామంది ముస్లింలు ఉన్నారని పేర్కొన్నారు. కానీ 2002 గోధ్రా అల్లర్ల తర్వాత ముస్లింలో తన ఇమేజ్‌ని ప్రత్యర్థులు చెడగొట్టారని వ్యాఖ్యానించారు. తాను ఎన్నటికీ హిందూ-ముస్లిం అంటూ తేడా చూపనని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు.

రాజస్థాన్ ప్రసంగంలో మోదీ చేసిన వ్యాఖ్యలేంటి?

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ దుమ్మెత్తిపోస్తూ.. ‘‘ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రజల దగ్గర ఉన్న బంగారం, ఆస్తులను స్వాధీనం చేసుకొని.. వాటిని చొరబాటుదారులకు, అధిక సంతానం ఉన్న వారికి పంచిపెడుతుంది’’ అని అన్నారు. అంతేకాదు.. మహిళల మెడలోని మంగళసూత్రం కూడా లాక్కుంటుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ముస్లింలను ఉద్దేశించే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని విపక్షాలు ధ్వజమెత్తారు. ఇందుకు బదులుగా ప్రధాని మోదీ పైవిధంగా క్లారిటీ ఇచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 15 , 2024 | 11:51 AM