Delhi : నితీశ్ చూపులెటు?
ABN , Publish Date - Sep 11 , 2024 | 05:18 AM
బిహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్(యూ) చీఫ్, సీఎం నితీశ్ కుమార్.. బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ కావడమే ఇందుకు కారణం..!
తేజస్వితో తాజాగా భేటీ.. అధికారిక సమావేశమేనన్న సీఎంవో
రాజకీయంగా తీవ్ర చర్చనీయం
పట్నా, సెప్టెంబరు 10: బిహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్(యూ) చీఫ్, సీఎం నితీశ్ కుమార్.. బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ కావడమే ఇందుకు కారణం..! వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నితీశ్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే తేజస్వీతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి వీరిద్దరూ భేటీ అయ్యారని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.
సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడేనని గుర్తుచేసింది. ఈ భేటీ తర్వాత తేజస్వీయాదవ్ చేసిన వ్యాఖ్యలు.. తాజా చర్చకు దారి తీశాయి. నితీశ్‌తో సమావేశం తర్వాత తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘65ు రిజర్వేషన్ల అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని నితీశ్ గుర్తుచేయగా.. న్యాయసమీక్షకు అతీతమైన రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో 65ు రిజర్వేషన్ల అంశాన్ని చేర్చేలా కృషిచేయాలని నేను కోరాను’’ అని ఆయన వివరించారు. మంగళవారం సాయంత్రానికి ఈ భేటీ దేశవ్యాప్తంగా ఓ సంచలనం కావడంతో.. తేజస్వీయాదవ్ మరోమారు మీడియాతో మాట్లాడారు.
‘‘నితీశ్‌ను నమ్మేది లేదు. ఆయన వాగ్దానాలపైనా నమ్మకం లేదు. బీజేపీతో చేరినందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొంటూ.. మా ఎమ్మెల్యేల ముందు చేతులు జోడించారు. రెండు సార్లు అధికారమిస్తే.. మోసం చేశారు. మరోమారు నితీశ్‌తో పొత్తు పెట్టుకునేది లేదు’’ అని తేల్చిచెప్పారు. అయితే, అదే సమయంలో నితీశ్ తిరిగి వస్తాడని, అతను తమవాడేనని ఆర్జేడీ నేత వీరేంద్ర విలేకరులతో చెప్పడం సంచలనంగా మారింది. ‘‘బీజేపీతో నితీశ్ అసంతృప్తిగా ఉన్నారు. సామ్యవాద భావాలున్న నితీశ్ బీజేపీతో ఉండలేరు’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని జేడీయూ కొట్టిపారేసింది. జేడీయూ ప్రధాన అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. బీజేపీతో తమ పార్టీకి కెమిస్ట్రీ మెరుగుపడుతోందని వ్యాఖ్యానించారు. తేజస్వీతో నితీశ్ భేటిని ఎక్కువగా ఊహించుకోవద్దన్నారు.
రిజర్వేషన్లపై ఇద్దరిదీ ఒకేమాట?
రిజర్వేషన్ల పెంపుపై జేడీయూ, ఆర్జేడీలది ముందు నుంచి ఒకే మాటగా ఉంది. ఇరు పార్టీల పొత్తుతో ప్రభుత్వం ఉన్నప్పుడే కులగణన ఆలోచనకు బీజం పడింది. కులగణన తర్వాత నితీశ్ ప్రభుత్వం బిహార్‌లో రిజర్వేషన్లను 65శాతానికి పెంచింది. దీన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని తేజస్వీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. శుక్రవారమే ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. మరోవైపు, ప్రస్తుతం నితీశ్ జట్టుకట్టిన బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉంది. వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.