Pregnant woman: భర్త చనిపోయిన బాధలో గర్భిణీ.. కానీ హాస్పిటల్లో ఊహించని అమానుషం
ABN , Publish Date - Nov 03 , 2024 | 07:27 AM
ఆమె 5 నెలల గర్భవతి.. భర్త చనిపోవడంతో పట్టరాని దుఃఖంలో ఉంది. భర్త శవం ఉన్న హాస్పిటల్లోనే ఆమె ఉంది. అయితే మాత్రం మాకేంటి? ఆసుపత్రి బెడ్‌కు అంటిన రక్తం మరకలు తుడవాల్సిందే.. అంటూ హాస్పిటల్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆమె 5 నెలల గర్భవతి.. భర్త చనిపోవడంతో పట్టరాని దుఃఖంలో ఉంది. భర్త శవం ఉన్న హాస్పిటల్లోనే ఆమె ఉంది. అయితే మాత్రం మాకేంటి? ఆసుపత్రి బెడ్‌కు అంటిన రక్తం మరకలు తుడవాల్సిందే.. అంటూ హాస్పిటల్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. అంతటి బాధతో, కడుపులో బిడ్డను మోస్తూనే ఆమె బెడ్‌పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. తన భర్త చనిపోయిన బెడ్‌కు అంటిన రక్తపు మరకలను ఆమె బలవంతంగా తుడిపించారు. అక్టోబర్ 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
గార్దసరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు 5 నెలల గర్భిణి అని అధికారలు వెల్లడించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వైద్యశాఖాధికారులు విచారణ చేపట్టారు. సామాన్య జనాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో బాధ్యతలైన వైద్య సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. దిండోరిలోని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO) క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రాథమిక కేంద్రంలో ఉన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ సింగ్‌ను తదుపరి నోటీసులు వచ్చేవరకు కరంజియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేశారు. ఇక నర్సింగ్ ఆఫీసర్ రాజకుమారి మరావి, వార్డు అటెండర్ ఛోటీ బాయి ఠాకూర్లను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న సిబ్బంది అందరికీ నోటీసులు పంపించామని, తదుపరి చర్యల కోసం వారి స్పందనలను జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపిస్తామని అధికారులు వివరించారు. కాగా ఈ అమానుష ఘటనపై మహిళ బంధువులు అధికారికంగా ఫిర్యాదు చేయడంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభించి చర్యలు తీసుకున్నారు.