Share News

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:13 PM

దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా? నష్టమా? తెలుసుకుందాం..

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

ఢిల్లీ: ప్రజాధనం ఆదా చేయడంతోపాటు, అభివృద్ధికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే జమిలీ ఎన్నికలను ప్రతిపాదిస్తున్నట్లు అధికార బీజేపీ చెబుతూ వస్తోంది. అయితే జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సహా ప్రధాన విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. తాజాగా రామ్ నాథ్ కోవింద్‌తో కూడిన కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా? నష్టమా? తెలుసుకుందాం..


2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే అంశాన్ని చేర్చింది. 2016లో నీతి ఆయోగ్ జమిలీ కాన్సెప్ట్ అమలు కోసం వర్క్‌షాప్‌ను నిర్వహించింది. 2 ఏళ్ల తర్వాత, 2018లో లా కమిషన్ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఐదు రాజ్యాంగ సిఫార్సులు అవసరమని సూచించింది. ఈ అంశంపై చర్చించేందుకు 2019లో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని కాంగ్రెస్, బహుజన్ సమాజ్‌వావదీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే వంటి విపక్షాలు బహిష్కరించాయి. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ, బీఆర్‌ఎస్‌ హాజరయ్యాయి. 2022లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర జమిలీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకోసం రాజ్యాంగంలో కొన్ని సవరణలు అవసరమని చెప్పారు.


లాభాలు..

కొన్ని నివేదికల ప్రకారం.. 2019 లోక్‌సభ ఎన్నికలకు మొత్తంగా రూ.60 వేల కోట్లు ఖర్చైంది. ఇందులో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం ఖర్చులు ఉంటాయి. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చును తగ్గించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల కోసం అధికారిక సిబ్బందిని నియమించడం రోజువారీ పరిపాలనా విధులు సాఫీగా సాగడంలో ఆటంకం కలుగుతోంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికారుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది.

దీంతో ఇది సాధారణ పరిపాలనానూ ప్రభావితం చేస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరమైన పనులపై ఎలాంటి ప్రభావం పడదని అధికార పక్షం భావిస్తోంది. రాష్ట్రాల్లో ఒక్కోసమయంలో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజాధనం వృథాతోపాటు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం పడుతోందని చెబుతోంది. భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రక్రియ ఉన్నందున అధికారులు సంక్షేమ పథకాలను చేరవేయడంపై దృష్టి పెట్టకపోవచ్చని అంటోంది. మరోవైపు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఇంకొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ప్రతికూలతలు..

రాష్ట్రాల్లో దశాబ్దాలకొలది వేళ్లూనుకున్న ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. అందుకు కారణమూ లేకపోలేదు. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఓటర్లు ఒకే పార్టీకి పట్టం కట్టే అవకాశమూ లేకపోలేదని.. తద్వారా స్థానిక పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి వస్తే ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యతాంశాలుగా మారతాయి. స్థానిక అంశాలు, సమస్యలు కనిపించకుండా పోతాయని ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల ఖర్చుల్లోనూప్రాంతీయ పార్టీలు పోటీపడాల్సి వస్తుంది. 2015లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమికి ఓటు వేస్తామని చెప్పారు. పార్లమెంట్‌, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గినట్లు తేలింది.

For Latest News and National News click here

Updated Date - Sep 18 , 2024 | 06:29 PM