Fact Check: వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో.. అందులో నిజమెంత?
ABN , Publish Date - Jun 11 , 2024 | 07:55 AM
Rahul Gandhi: డీప్‌ఫేక్.. డీప్‌ఫేక్.. డీప్‌ఫేక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. యువత ఎదుగుదల కోసం ఈ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తే.. కొన్ని వర్గాల వారు దీనిని..
డీప్‌ఫేక్ (Deepfake).. డీప్‌ఫేక్.. డీప్‌ఫేక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. యువత ఎదుగుదల కోసం ఈ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తే.. కొన్ని వర్గాల వారు దీనిని దుర్వినియోగపరుస్తున్నారు. తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి.. వారి ఇమేజ్‌ని దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టిస్తున్నారు. ఈమధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) లక్ష్యంగా చేసుకొని.. రకరకాల డీప్‌ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మరో వీడియోని రిలీజ్ చేసి వైరల్ చేయగా.. అది ఫేక్ అని తేలిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల నరేంద్ర మోదీ (Narendra Modi) భారత ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరు కాని రాహుల్ గాంధీ.. లైవ్ మాత్రం వీక్షించినట్టు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. తన కారులో కూర్చొని, బ్యాక్ సీటుకి ఎటాచ్ చేసి ఉండే ట్యాబ్‌లో.. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాహుల్ చూస్తున్నట్టు ఆ వీడియోలో మనం గమనించవచ్చు. ఇది నెట్టింట్లోకి రావడమే ఆలస్యం.. క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ వీడియో నిజమేనేమోనని భావించి.. నెటిజన్లు షేర్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. కాంగ్రెస్ వ్యతిరేకులు దీన్ని షేర్ చేసి, రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అయితే.. దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తే, అది ఫేక్ వీడియో అని తేలింది. రాహుల్ కారులో కూర్చున్న దృశ్యం నిజమే గానీ.. మిగతాదంతా అబద్ధం. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. 2019లో మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని, ఈ డీప్‌ఫేక్ వీడియోలో ఎడిట్ చేశారు. గతంలో తాను దేశం గురించే ఆలోచిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ ఓ వీడియో షేర్ చేయగా.. దాన్నే ఏఐ సహకారంతో ఎడిట్ చేసి, మోదీ ప్రమాణస్వీకారాన్ని చూస్తున్నట్టు ఫేక్ వీడియో సృష్టించడం జరిగింది. చివరికి ఇది డీప్‌ఫేక్ వీడియో అని తేలడంతో.. దాన్ని సృష్టికర్తపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Read Latest National News and Telugu News