Share News

పెళ్లికొడుకు కోసం ఆగిన రైలు!

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:21 AM

ఓ పెళ్లి కొడుకు మండపానికి సమయానికి చేరుకునేందుకు రైల్యే శాఖ ఏకంగా ఓ రైలు సర్వీసును ఆలస్యంగా నడిపింది.

పెళ్లికొడుకు కోసం ఆగిన రైలు!

కోల్‌కతా, నవంబరు 17: ఓ పెళ్లి కొడుకు మండపానికి సమయానికి చేరుకునేందుకు రైల్యే శాఖ ఏకంగా ఓ రైలు సర్వీసును ఆలస్యంగా నడిపింది. ఈ అరుదైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగింది. ముంబైకు చెందిన చంద్రశేఖర్‌ వాఘ్‌ అనే వ్యక్తి పెళ్లికి గువాహటిలో ఏర్పాట్లు చేశారు. అతడు 34 మందితో ఈనెల 14న ముంబైలో బయలుదేరి 15న హౌరాకు చేరుకుని అక్కడి నుంచి గువాహటికి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే హౌరా చేరకునేందుకు వారు ఎక్కిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ మూడున్నర గంటలు ఆలస్యమైంది. దాంతో హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుకోలేమని గ్రహించిన పెళ్లి కొడుకు వెంటనే అత్యవసర సహాయం కావాలంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను, రైల్వే శాఖను ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు.

తమ రిజర్వేషన్‌ టికెట్ల పోటోలను దానికి జత చేశాడు. స్పందించిన రైల్వే శాఖ గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ వచ్చేవరకు హౌరాలో సరైఘట్‌ ఎక్స్‌ప్రెస్‌ను వేచి ఉంచింది. దాంతో చంద్రశేఖర్‌, అతడి బంధువులు కనెక్టింగ్‌ రైలును అందుకొని పెళ్లికి వెళ్లారు. తన పెళ్లికి సరైన సమయంలో చేరుకునేందుకు సహాయం చేసిన రైల్వే శాఖకు, అధికారులకు చంద్రశేఖర్‌ ఎక్స్‌లో ధన్యవాదాలు తెలిపారు. అయితే రైల్వే శాఖ చర్యపై కొంత మంది నెటిజన్లు మండిపడ్డారు. ‘‘ఒక వ్యక్తి, అతడి కుటుంబం కోసం రైలును ఆలస్యం చేయడం న్యాయమేనా.. ఒక రైలు ఆలస్యమైతే మరో రైలును ఆలస్యంగా నడపడం సమంజమేనా? మీరు గీతాంజలి ఎక్స్‌ప్రె్‌సను సరైన సమయంలో నడపలేక పోయారు ఇప్పుడీ విషయంలో క్రెడిట్‌ తీసుకోవాలనుకుంటున్నారు’’ అని ఓ యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ వైఫల్యాన్ని దాచుకునేందుకు మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం ఆపండి’’ అని మరొకరు పేర్కొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 04:21 AM